Telangana BJP: బీజేపీ కార్యకర్తలు, నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఫస్ట్ లిస్ట్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. మొదటి లిస్ట్‌లో 52 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. కానీ ఇందులో ఎక్కడా సీనియర్లు కనిపించలేదు. రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు మినహా.. మిగిలిన వాళ్లు అంతా దాదాపుగా జిల్లాలకు పరిమితమైన నేతలే. పార్టీలో కీలకమైన నేతలెరికీ ఫస్ట్ లిస్ట్‌లో టికెట్లు కేటాయించలేదు బీజేపీ. కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, లక్ష్మణ్, వివేక్ లాంటి వాళ్ల పేర్లు కనిపించలేదు.
దీని వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టు బీజేపీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ముఖ్యం. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే బీజేపీ లోక్‌సభ స్థానాల్లో గెలవాలి. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో బీజేపీ సీనియర్లను లోక్‌సభ బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సీనియర్లు కూడా ఎంపీగా పోటీ చేసేందుకే సుముఖత చూపిస్తున్నారట. ఇదే విషయంపై పార్టీ మీటింగ్‌లో కీలక చర్చలు కూడా జరిగినట్టు సమచారం. చాలా మంది పార్లమెంట్ మీద ఇంట్రెస్ట్ చూపించిన కారణంగానే ఫస్ట్ లిస్ట్‌లో ఎవరి పేర్లూ లేవు అనే చర్చ జరుగుతోంది. ఇక సెంకండ్ లిస్ట్ గురించి కూడా బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించబోతోంది.
ఈసారి సీనియర్లతో మరోసారి చర్చలు జరిపి అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ తమ క్యాండిడేట్లను ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టింది. కాంగ్రెస్ కూడా 55 మందిని ప్రకటించి బస్సు యాత్రలో బిజీగా ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా లిస్ట్ రావడంతో ఇక ప్రచారం హోరాహోరీగా సాగనుంది. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్, మేనిఫెస్టోతో బీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుందో చూడాలి.