TELANGANA ASSEMBLY ELECTIONS: బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్‌కు కేసీఆర్ మేలు చేశారా..?

తమ పథకాలనే కేసీఆర్ కాపీ కొట్టారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజానికి అనేక అంశాల్లో కాంగ్రెస్ హామీలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో దగ్గరగానే ఉంది. ఈ అంశమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసిందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 01:52 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో ప్రజాకర్షకంగానే ఉంది. అయితే, ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ గ్యారెంటీలను పోలి ఉందనే విమర్శలు మొదలయ్యాయి. తమ పథకాలనే కేసీఆర్ కాపీ కొట్టారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజానికి అనేక అంశాల్లో కాంగ్రెస్ హామీలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో దగ్గరగానే ఉంది. ఈ అంశమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసిందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను మించేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది. కాంగ్రెస్ పార్టీ గృహలక్ష్మీ పథకంలో భాగంగా అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ రూ.3,000 ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే.. బీఆర్ఎస్ రూ.400కే ఇస్తామంది. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా కింద ప్రతి ఏటా రూ.15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. రైతు బంధు పేరిట రూ.16,000 ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వంటి అర్హులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ చెబితే.. తాము రూ.3,016 ఇస్తామని, ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.500 పెంచుకుంటూ రూ.5,000 వరకు ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది. దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే ఇండ్లు లేని పేదవారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల సాయం అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది. బీఆర్ఎస్ కూడా పేదవారికి ఇండ్లు కట్టిస్తామని చెప్పింది. ఇలా అనేక అంశాల్లో కేవలం కాంగ్రెస్‌కు ధీటుగా ఉండాలనే ఆలోచనతోనే కేసీఆర్ పథకాల్ని ప్రకటించినట్లుంది. చాలా విషయాల్లో కేసీఆర్.. కాంగ్రెస్‌నే అనుసరించారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలకు మంచి స్పందన రావడంతో, వాటిని మించేలా మేనిఫెస్టో రూపొందించారు.
కాంగ్రెస్‌పై విమర్శలు.. ఇకపై ఏం చెబుతారు..?
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై ఇంతకాలం బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రకటించిన పథకాల్ని అమలు చేయడం సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఇందుకు నిధులు సరిపోవన్నారు. ఇదే తరహా పథకాల్ని కర్ణాటకలో ప్రకటించినప్పటికీ.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని, నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. గ్యారెంటీల ద్వారా ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేయాలనుకుంటోందని విమర్శించారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ అంతకుమించిన హామీల్ని ప్రకటించింది. నిజానికి కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలుకంటే.. బీఆర్ఎస్ హామీల అమలే అసాధ్యం. దీనికే ఎక్కువ నిధులు కావాలి. మరి కాంగ్రెస్ హామీలే కష్టమని చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఇక తాము ఎలా హామీల్ని నిలబెట్టుకుంటారో ప్రజలకు వివరించాలి.

బీఆర్ఎస్ మేనిఫెస్టో ద్వారా ఇకపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత కోల్పోయారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, తాము కాంగ్రెస్‌లాగా ఒకేసారి అన్ని పథకాల్ని అమలు చేస్తామని చెప్పడం లేదని, దశలవారీగా అమలు చేస్తామని మాత్రమే ప్రకటించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ధీటుగా మేనిఫెస్టో రూపొందించే క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, ఇది కాంగ్రెస్‌కు మేలు చేసేలా ఉందనే చర్చా నడుస్తోంది. ఏదేమైనా.. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయడం సాధ్యమనే విషయాన్ని బీఆర్ఎస్ రుజువు చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.