Sunitha Laxma Reddy: ఎట్టకేలకు.. నర్సాపూర్‌ బీఆర్ఎస్ అభ్యర్ధిగా సునితా లక్ష్మారెడ్డి..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ఖరారు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి ఆధ్వర్యంలోనే సునితా లక్ష్మారెడ్డికి బీఫాం అందించారు. సునితా రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యతను మదన్‌ రెడ్డికి అప్పగించారు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 04:23 PM IST

Sunitha Laxma Reddy: బీఆర్‌ఎస్‌ హోల్డ్‌లో పెట్టిన నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించారు సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ఖరారు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి ఆధ్వర్యంలోనే సునితా లక్ష్మారెడ్డికి బీఫాం అందించారు. ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.

సునితా రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యతను మదన్‌ రెడ్డికి అప్పగించారు. పార్టీ నిర్ణయంతో మదన్‌ రెడ్డి కూడా సునితా రెడ్డికి మద్దతు తెలుపుతానంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి స్థానంలో మదన్‌ రెడ్డి పోటీలో ఉంటారని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయిచింది. జిల్లాలో ఉన్న చిన్న చిన్న వివాదాలను సర్దుబాటు చేసుకుంటూ నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు కేసీఆర్‌. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా సునీతా ల‌క్ష్మారెడ్డి గెలిచారు. 2009లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రివ‌ర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత రోశ‌య్య మంత్రివ‌ర్గంలో కొన‌సాగారు.

2010లో కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మ‌హిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం స‌హాయ‌క సంఘాలు, ఇందిరా క్రాంతి ప‌థం, పింఛ‌న్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వ‌ర‌కు శాస‌న‌స‌భ మ‌హిళా శిశు సంక్షేమ క‌మిటీ చైర్‌ప‌ర్సన్‌గా కొన‌సాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సునీతా ల‌క్ష్మారెడ్డి.. 2019 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు. అనంత‌రం మ‌హిళా క‌మిష‌న్ చైర్‌పర్సన్‌గా సునితా లక్ష్మారెడ్డిని నియమించారు కేసీఆర్‌. అప్పటి నుంచి తన బాధ్యతతో పాటు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డారు సునిత. దీంతో ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఒప్పించి మరీ కేసీఆర్‌ సునితా లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు.