Telangana BJP: ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ తర్వాత… అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. టికెట్ వస్తుందని ఆశపడి.. భంగపడిన నేతలంతా.. ఇప్పుడు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మునుగోడులోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయ్. ఒక్క ఉప ఎన్నికతో మునుగోడు పేరు రాష్ట్రం అంతా రీసౌండ్ ఇచ్చింది ఆ మధ్య! కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి చేరి.. మళ్లీ కమలాన్ని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఆయన రాక.. మునుగోడులో రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. మునుగోడు టికెట్ తనదే అని.. స్థానిక కాంగ్రెస్ నేత చల్లమల కృష్ణారెడ్డి ధీమాతో ఉండగా.. సెకండ్ లిస్ట్‌లో రాజగోపాల్‌కు ఆ స్థానాన్ని కేటాయించింది కాంగ్రెస్. ఇదే కృష్ణారెడ్డి అసంతృప్తికి కారణం అవుతోంది. రాజగోపాల్ రెడ్డిని స్వాగతిస్తాం తప్ప.. టికెట్ ఇవ్వడాన్ని కాదు అంటూ తిరుగుబాటు జెండా ఎగురవేశారు కృష్ణారెడ్డి. రేవంత్‌తో పాటు పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడు బరిలో ఉంటానని చల్లమల్ల తెగేసి చెప్తున్నారు. ఐతే ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. చల్లమల్ల కృష్ణారెడ్డిని తమ పార్టీ తరఫున మునుగోడు బరిలో దింపితే.. రాజకీయం తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని.. కోమటిరెడ్డికి గట్టి పోటీ ఇవ్వొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.
అందుకే కమలం పార్టీ పెద్దలు.. చల్లమల కృష్ణారెడ్డితో టచ్‌లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. టికెట్ హామీతో చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే.. మునుగోడులో కోమటిరెడ్డికి భారీ షాక్ తగలడం ఖాయం. దీంతో మునుగోడు రాజకీయాన్ని రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిస్తోంది. మరి చల్లమల్ల బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా.. లేదంటే కాంగ్రెస్ బుజ్జగింపులకు కూల్ అవుతారా.. ఏం జరగబోతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.