Chalamalla Krishna Reddy: తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు, ఎవరు పార్టీ కండువా మారుస్తారో అర్థంకాని పరిస్థితి. దాదాపు అన్ని పార్టీల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. పార్టీ కోసం ప్రాణం ఇస్తాం అంటూ నిన్నటి వరకూ మాట్లాడినవాళ్లు కూడా.. టికెట్ల కోసం కండువా మార్చేస్తున్నారు. ఇదే క్రమంలో మునుగోడు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న చలమల్ల కృష్ణారెడ్డి (Chalamalla Krishna Reddy).. కాంగ్రెస్ (congress) పార్టీ వీడి బీజేపీలో చేరారు. చాలా కాలం నుంచి మునుగోడు (munugode) కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు కృష్ణా రెడ్డి.
దాదాపు టికెట్ ఆయనకే అనుకున్న సమయంలో అంతా రివర్స్ అయ్యింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వదిలి కాంగ్రెస్‌లోకి రావడంతో.. మునుగోడు టికెట్‌ను రాజగోపాల్ రెడ్డికి కన్ఫాం చేసింది కాంగ్రెస్ హై కమాండ్. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా.. తనకు టికెట్ దక్కకపోవడంతో కృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తామంటూ అనుచరులు చెప్పడంతో బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కృష్ణారెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి బరిలో దిగబోతున్నారంటూ మునుగోడులో చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయంలో ఇప్పటికీ బీజేపీ నుంచి సరైన స్పష్టత లేదు. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేస్తామంటూ బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఆల్రెడీ సీట్లు డిక్లేర్ చేసిన జనసేన కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి బీజేపీతో చర్చలు ప్రారంభించింది.
జనసేనతో టికెట్ల వ్యవహారంలో క్లారిటీ వచ్చిన వెంటనే బీజేపీ మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తుంది. కృష్ణారెడ్డి పార్టీ మార్పుతో మునుగోడులో భారీ స్థాయిలో ఓట్‌బ్యాంక్ చీలిపోయే ప్రమాదముంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా.. కాంగ్రెస్ నుంచే ఆయనకు కాస్త వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న కృష్ణారెడ్డి పార్టీని వీడటం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి గెలుపు కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.