CM KCR: గజ్వేల్‌లో ఓటమి భయం.. కార్యకర్తలతో భేటీ కానున్న కేసీఆర్..!

గజ్వేల్‌లో కేసీఆర్ వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే, ఈసారి మాత్రం అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అక్కడి నుంచి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తే కేసీఆర్ గెలిచే అవకాశాలు తగ్గుతాయి.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 02:19 PM IST

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి గత ఎన్నికల్లో గెలిచినంత ఈజీ కాదు అనే సంగతి కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే ప్రతి నియోజకవర్గంపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. చివరగా గ్యారెంటీగా గెలిచి తీరుతాం అనేుకునే సిరిసిల్ల, సిద్ధిపేటలో కూడా కేసీఆర్ ప్రచారం చేశారంటే ప్రతి నియోజకవర్గాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతోంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు, సిద్ధిపేటలో హరీష్ రావుకు పెద్దగా ఎదురుండదని తెలిసిన విషయమే.

అయినప్పటికీ.. అక్కడ కేసీఆర్‌తో వాళ్లు ప్రచారం చేయించారు. ఇదంతా ఒకెత్తు.. గజ్వేల్ ఒకెత్తు అన్నట్లుగా ఉంది పరిస్తితి. గజ్వేల్‌లో కేసీఆర్ వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే, ఈసారి మాత్రం అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అక్కడి నుంచి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తే కేసీఆర్ గెలిచే అవకాశాలు తగ్గుతాయి. కేసీఆర్ స్థానిక నేతలకు అందుబాటులో ఉండకపోవడమే అక్కడ ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణం. దీంతో స్తానిక నేతల నుంచి కూడా కేసీఆర్‌పై వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్లంతా ఈసారి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పని చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఈటల రాజేందర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. పైగా గజ్వేల్‌లో ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గెలుపు అవకాశాలు తగ్గొచ్చు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతే అది రాజకీయంగా ఆయనకు పెద్ద మచ్చ.

అందుకే గజ్వేల్‌పై కూడా కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన 20-25 మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ కానున్నారు. వాళ్లందరితో మేడ్చల్ జిల్లా, ఆంతాయిపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు కేసీఆర్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు లేవు. అక్కడి ప్రచార బాధ్యతలను మంత్రి హరీష్ రావు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వంటి నేతలకు అప్పగించారు. వాళ్లంతా గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ సారి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.