TELANGANA TDP: తెలంగాణలో టీడీపీ మద్దతుదార్లు, కమ్మ సామాజికవర్గం ఓట్లు కీలకంగా మారాయి. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడంలేదని ప్రకటించడంతో వాళ్ల మద్దతు దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి తెలంగాణ కంటే ఏపీ చాలా ఇంపార్టెంట్. ఈ కారణంగానే తెలంగాణలో పోటీ చేయడంలేదని ఆ పార్టీ ప్రకటించింది. పోటీ చేయడంలేదు సరే.. మరి టీడీపీ మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ల ఓట్లు వాళ్లే వేసుకుంటారు. కానీ పోటీ చేయకపోతే ఎవరో ఒకరికి మద్దతు తెలిపాలి. దీంతో టీడీపీ సానుభూతిపరుల మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి (REVANTH REDDY) ప్రస్తుతం కాంగ్రెస్ (CONGRESS) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన చంద్రబాబు మనిషి అనే ముద్ర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టీడీపీ (TDP) మద్దతుదారుల ఓట్లు వెళతాయని కొందరు అంటున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి బీఆర్‌ఎస్ (BRS) నేతలు కూడా టీడీపీ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను వరుసగా అందరూ ఖండించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వడంతో ఖమ్మంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్‌కు పువ్వాడ అజయ్ కూడా వెళ్లి తన మద్దతు తెలిపారు. ఇక తుమ్మల నాగేశ్వర్ రావు ఏకంగా టీడీపీ కండువా కప్పుకుని నానా హంగామా చేశారు.
టీడీపీ ఓట్ బ్యాంక్‌ను తమవైపు మళ్లించుకునేందుకు వీళ్లంతా టీడీపీ మీద ప్రేమ చూపిస్తున్నారంటూ విశ్లేషకులు చెప్తున్నారు. మరోపక్క ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీకి దిగుతోంది. ఈ రెండు పార్టీలను కాదని జనసేనకు టీడీపీ తమ మద్దతు తెలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి టీడీపీ మద్దతుదార్లు, కమ్మ ఓటర్లు ఎవరికి జై కొడతారో చూడాలి.