TELANGANA ASSEMBLY ELECTIONS: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయ్. ఎవరు, ఎప్పుడు.. ఏ పార్టీలోకి జంప్ కొడతారో.. రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో.. అంత ఈజీగా అర్థం కాని పరిస్థితి. హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. అధికారంలోకి వచ్చి తీరాలని కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయ్. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతుండడంతో.. దాన్ని క్యాచ్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దనే పట్టుదలతో కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల యుద్ధం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అని క్లియర్‌గా అర్థం అవుతోంది. దీంతో ఒక పార్టీని దెబ్బ కొట్టేందుకు మరో పార్టీ.. ఒక పార్టీపై పై చేయి సాధించేందుకు మరో పార్టీ.. చేరికలను ప్రోత్సహిస్తున్నాయ్. ఇక అసంతృప్తులు కూడా అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తున్నారు. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు.. ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. బీజేపీ కూడా చేరికలపై ఫోకస్ పెట్టినా.. అనుకున్న స్థాయిలో సక్సెస్ కావడం లేదు. దీంతో ఇన్ని జంపింగ్స్, ఇన్ని చేరికలు.. ఏ పార్టీకి లాభం చేస్తాయ్.. ఎవరి కొంప ముంచుతాయనే చర్చ జనాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల వేళ.. ముందూ, వెనుకా ఆలోచించకుడా వచ్చిన వాళ్లను వచ్చినట్లు పార్టీలన్నీ తమతో కలుపుకుంటన్నాయ్. సభలు, సమావేశాల్లో పార్టీ కండువాలు కప్పేస్తున్నాయ్. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టేందుకు.. తమ పార్టీ బలాన్ని చాటేందుకు చేరికలు ఉపయోగపడతాయని పార్టీలు భావిస్తున్నాయ్. ఐతే చేరికల వల్ల పార్టీలో సమస్యలు కూడా వస్తున్నాయనే టాక్ ఉంది. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొత్తగా వచ్చినవాళ్లకే టికెట్లు ఇస్తున్నారంటూ.. ఓ వర్గం ఆందోళనకు దిగుతోంది. గాంధీభవన్ దగ్గర ఆందోళనలు కూడా చేస్తోంది.
కొందరు నేతలయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ మీద చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. నోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారని.. భూములు, ఇండ్లు తీసుకొని టికెట్లు ఇస్తున్నారని.. ఇలా రకరకాల ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్‌కు ఆయుధం దొరికినట్లు అయింది. రేవంత్ రెడ్డిని.. ఇప్పుడు రేటెంత రెడ్డి అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది కానీ జనాల్లోకి బలంగా వెళ్తే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రచారానికి తోడు కోవర్టుల భయం కూడా ఉంటుంది. అందుకే చేరికల విషయంలో అన్నీ ఆలోచించకపోతే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏ పార్టీ అయినా గ్రహించాల్సింది ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.