TELANGANA ASSEMBLY ELECTIONS: పొంగులేటి భారీ షాక్ ఇచ్చిన కాంగ్రెస్‌! ఇప్పుడేం జరగబోతోంది..?

పొంగులేటికి హామీ ఇచ్చినట్లు.. ఆయన అనుచరులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు ఏకంగా పొంగులేటి సీటుకే కాంగ్రెస్ ఎసరు పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 03:19 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేందుకు ఇష్టపడడం లేదు. నెగ్గేందుకు.. ఎంతవరకు అయినా సరే తగ్గేందుకు రెడీ అవుతోంది. లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తులపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఆ రెండు పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు.. సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ టికెట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదే నిజం అయితే.. బీఆర్ఎస్‌కు ఎదురుతిరిగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటికి భారీ షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పార్టీ కండువా కప్పుకోవడానికి ముందే.. కాంగ్రెస్‌ అధిష్టానం దగ్గర పొంగులేటి కొన్ని కండిషన్లు పెట్టారు. ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్‌ ఓకే చెప్పింది కూడా! ఐతే ఆ తర్వాత పార్టీలో రకరకాల మార్పులు జరిగాయ్. కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు మొదలయ్యాయ్. దీంతో పొంగులేటికి హామీ ఇచ్చినట్లు.. ఆయన అనుచరులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు ఏకంగా పొంగులేటి సీటుకే కాంగ్రెస్ ఎసరు పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. దీంతో పొంగులేటికి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. ఐతే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని పొంగులేటికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పినపాకకు పంపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్.

ఐతే ఇదంతా ప్రచారం మాత్రమే. అధికారికంగా అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటిస్తే తప్ప.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేదానిపై క్లారిటీ రాదు. నిజానికి లెఫ్ట్ పార్టీలు ఆ నాలుగు స్థానాలపై ముందు నుంచి పట్టు మీద ఉన్నాయ్. అక్కడ ఈ పార్టీలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది కూడా! పొత్తు నిజంగా ఖాయం అయితే.. ఆ నాలుగు స్థానాలను వారికి కేటాయించి తీరాలి. అదే జరిగితే.. పొంగులేటి షాక్ తగలడం ఖాయం. పొంగులేటి ఖమ్మంకు షిఫ్ట్ అయితే.. మంత్రి పువ్వాడ మీద పోటీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రాజకీయం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.