T CONGRESS: టార్గెట్‌ తెలంగాణ.. మరోసారి తెలంగాణకు రానున్న ప్రియాంక గాంధీ..

ఒకప్పటితో కంపేర్‌ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. కాస్త కష్టపడితే ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ ఛాన్స్‌ను మిస్‌ చేసుకోవద్దు అనుకుంటోంది కాంగ్రెస్‌ అధిష్టానం. అందుకే అంది వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్నీ వాడుకుంటోంది.

  • Written By:
  • Updated On - October 22, 2023 / 05:50 PM IST

T CONGRESS: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ, సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఈ నెల 31న కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆమె పాల్గొనబోతున్నారు. రాహుల్‌ గాంధీతో పాటు రీసెంట్‌గానే తెలంగాణలో పర్యటించారు ప్రియాంక గాంధీ. నెల రోజులు కూడా గడవకముందే మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్ర నేతల పర్యటనలతో కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. కొల్లాపూర్‌ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించబోతున్నారు.

దాంతోపాటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ మీద కాంగ్రెస్‌ పార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే అగ్రనేతలు వరుసబెట్టి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఒకప్పటితో కంపేర్‌ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. కాస్త కష్టపడితే ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ ఛాన్స్‌ను మిస్‌ చేసుకోవద్దు అనుకుంటోంది కాంగ్రెస్‌ అధిష్టానం. అందుకే అంది వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్నీ వాడుకుంటోంది. కలిసి వస్తామన్న ప్రతీ వ్యక్తినీ కలుపుకొని పోతోంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు ఉన్నా కూడా తెలంగాణ ఎన్నికల కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేతలు. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే 55 మందికి సీట్ల కేటాయింపు కూడా పూర్తయ్యింది. త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా కాలంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు కొంత మేర పని చేసే చాన్స్‌ ఉంది. అధికారంలోకి వస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే.. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని అందరూ చెప్తున్న మాట.