TELANGANA ASSEMBLY ELECTIONS: కేసీఆర్‌పై పోటీకి షబ్బీర్ అలీ నో.. భయపడ్డారా.. వ్యూహం ఉందా..?

కామారెడ్డిపై కాంగ్రెస్‌ నజర్ పెట్టింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత షబ్బీర్ అలీ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈసారి కూడా ఆయనకే దాదాపు టికెట్ కన్ఫార్మ్ అనుకుంటున్న సమయంలో.. కామారెడ్డి స్థానంపై హస్తం పార్టీలో కన్ఫ్యూజన్ మొదలైనట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 04:35 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: ఈసారి తెలంగాణ ఎన్నికలు చాలా ప్రత్యేకం. 2014, 2018లో అసెంబ్లీకి ఎన్నికలు జరగగా అప్పట్లో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయ్. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్‌ మీద జనాల్లో వ్యతిరేకత కనిపిస్తుండడం.. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో.. పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయ్. ఇదంతా ఒకెత్తు అయితే.. కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం మరో హైలైట్‌. రాజకీయాల్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా.. ఒకటికి వంద సార్లు ఆలోచించే కేసీఆర్.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారంటే.. దాని వెనక భారీ వ్యూహమే ఉంది అన్నది క్లియర్‌.

గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీని బీజేపీని సీరియస్‌గా తీసుకుంటే.. కామారెడ్డిపై కాంగ్రెస్‌ నజర్ పెట్టింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత షబ్బీర్ అలీ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈసారి కూడా ఆయనకే దాదాపు టికెట్ కన్ఫార్మ్ అనుకుంటున్న సమయంలో.. కామారెడ్డి స్థానంపై హస్తం పార్టీలో కన్ఫ్యూజన్ మొదలైనట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ మీద పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ సుముఖంగా లేరని తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు షబ్బీర్‌ అలీ స్థానంపై కేసీఆర్ మీద ఎవరిని పోటీకి దింపాలన్నది కాంగ్రెస్ పార్టీకి తలపోటుగా మారింది. కేసీఆర్‌కు పోటీ అంటే.. సీనియర్ నేతే రంగంలో ఉండాలి. అలా కాకుండా.. కొత్త మొహాలని ఎలా బరిలో పెడతారని పార్టీ హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్.. లేదంటే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక అటు నిజామాబాద్ అర్బన్‌పై షబ్బీర్ అలీ కన్నేయడంతో అక్కడ కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. ఇక్కడి నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో లక్షా 20వేలకుప పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయని.. ఇక్కడ ఆ వర్గం అభ్యర్థిని నిలబెట్టాలని ఏఐసీసీలోని ముస్లిం నేతలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో షబ్బీర్ అలీ కూడా అదే స్థానం కోసం పట్టుబడుతున్నట్లు టాక్.