డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్.. రేవంత్ ని కలవడంపై ఈసీ సీరియస్

తెలంగాణలో ఎన్నికల ఫలితాల వేళ ఊహించని పరిణామం జరిగింది. రాష్ట్ర డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చింది.

తెలంగాణలో ఎన్నికల ఫలితాల వేళ ఊహించని పరిణామం జరిగింది. రాష్ట్ర డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చింది. ఇంతకీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే.. ఈసీ కోడ్ అమల్లో ఉన్న టైమ్ లో.. నిబంధనలకు విరుద్ధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడమే.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైమ్ లో ప్రభుత్వ అధికారులెవరూ ఏ రాజకీయ నాయకుడిని కలవకూడదు. అలా కలిస్తే కోడ్ ఉల్లంఘన కింద వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ఈసీకి ఉంటుంది. సరిగ్గా ఈ కారణం మీదే తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసింది ఈసీ. కాంగ్రెస్ కి మెజారిటీ రావడంతో.. నెక్ట్స్ ఏర్పడే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కావడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్ళారు డీజీపీ అంజనీ కుమార్. ఆయనతో పాటు అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్ కూడా వెళ్ళారు. ఓ వైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇంకా ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. ఎన్నికల కోడ్ కూడా ఇంకా ముగియలేదు. ఈ టైమ్ లో రేవంత్ ని డీజీపీ కలవడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది.

డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేయడంతో పాటు.. ఇద్దరు అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్ కు నోటీసులు ఇచ్చింది ఈసీ. కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను సూచించాలని సీఎస్ శాంత కుమారిని ఆదేశించింది ఈసీ. దాంతో రవిగుప్తా, రాజీవ్ రతన్, సజ్జనార్ తో పాటు మరొకరి పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపుతున్నారు సీఎస్. ఈ నలుగురిలో ఒకరిని డీజీపీగా ఎన్నికల సంఘం నియమించనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రులను కలవడాన్ని కూడా ఈసీ సీరియస్ గా తీసుకుంది. గత నెలలో తిరుమల పర్యటనలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు వెళ్ళిన పర్యాటకశాఖ ఎండీ బోయినపల్లి మనోహర్ రావు ను సస్పెండ్ చేసింది. OSDపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.