TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు సర్వేల మాయాజాలం నడుస్తోంది. కాంగ్రెస్ గెలవబోతోంది అని ఒక సర్వే వస్తుంది.. ఆ సర్వే వచ్చిన 24 గంటల్లోనే తెలంగాణలో బీఆర్ఎస్ 75 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని మరో సర్వే రిలీజ్ అవుతుంది. ఇక వాట్సప్‌లో అయితే రోజుకొక సర్వే. ఒక సర్వే ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్తే.. మరో సర్వే ఈ పార్టీ గెలిచిందని చెప్తుంది. చివరికి ఏ సర్వే నిజమో.. ఏ సర్వే అబద్ధమో అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు.
ఈ సర్వేలన్నీ పార్టీలే ఫండింగ్ చేసి విడుదల చేయిస్తున్నాయని.. సర్వేల ద్వారా జనాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇండియా టుడే ఛానల్ సి ఓటర్‌తో కలిసి చేసిన సర్వే.. 54 స్థానాలతో కాంగ్రెస్ తెలంగాణలో ముందంజలో ఉంది అని ప్రకటించింది. ఇది జరిగిన 24గంటల్లోనే జాతీయ ఛానల్ ఇండియా టీవీ తన సర్వేలో బిఆర్ఎస్ గెలవబోతుందని అంకెలతో సహా వెల్లడించింది. ఇండియా టుడే సి ఓటర్ సర్వే వచ్చిన 24గంటల్లోనే… ఇండియా టీవీలో అందుకు పూర్తి భిన్నంగా వచ్చిందంటే ఈ రెండు సర్వేల మధ్య ఏం జరిగిందో జనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు టుడే చాణక్య అనే సంస్థ తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని ప్రెస్ మీట్ పెట్టి తన సర్వే నెంబర్స్ రిలీజ్ చేసింది.
ముందుగా ప్లాన్ చేసుకున్న బీఆర్ఎస్ అనుకూల చానల్స్ ఈ సర్వేని తాము కూడా ప్రసారం చేయడమే కాకుండా దానిపై భారీ చర్చలు కూడా పెట్టాయి. కాంగ్రెస్ అనుకూల పత్రికలు, చానల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన సర్వేలను హైలెట్ చేస్తుంటే.. బీఆర్ఎస్ అనుకూల పత్రికలు, చానల్స్ బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిన సర్వేలను హైలెట్ చేస్తూ చర్చలు విశ్లేషణలు కొనసాగిస్తున్నాయి. ఇక వాట్సప్ ఓపెన్ చేస్తే చాలు.. రకరకాల సర్వేలు. ఆ పార్టీ గెలిచిందని, ఈ పార్టీ ఓడిపోతుందని, అంత పర్సంటేజ్ వచ్చిందని, ఇంత పర్సంటేజ్ వచ్చిందని, రకరకాల యాంగిల్స్ లో సర్వేలు కనిపిస్తున్నాయి. సర్వేల విషయంలో కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. వస్తున్న సర్వేల్లో ఎక్కువ వాటిలో కాంగ్రెస్ గెలవబోతుందని ఇప్పటికే 55 సీట్లు పైగా వచ్చే సూచనలు ఉన్నాయని ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తన సర్వేల వ్యూహంతో జనాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరైనా గెలిచే గుర్రం మీదే పందెం కడతారు. సామాన్య జనం కూడా అంతే. ఒక పార్టీ గెలుస్తుంది అంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా తటస్థ ఓటరు.. సమాజంలోని టాక్ బట్టి తాను ఎట్లుండాలో డిసైడ్ చేసుకుంటాడు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రకరకాల అనుకూల సర్వేలు చేసి జనంలోకి వదులుతున్నాయ్. ఈ విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. అధికారంలో లేని పార్టీ కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అంటే జనంలో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది.
ఈ ప్రమాదాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ కూడా రకరకాల సర్వేలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. సర్వే ఫలితాలు పక్కగా రావాలంటే శాంపిల్ సైజ్ ఎక్కువ ఉండాలి. జాతీయస్థాయిలో చేసే సర్వేలు చూస్తుంటే అదో పెద్ద కామెడీ సినిమాను తలపిస్తుంది. తెలంగాణ మొత్తం ఐదువేల శాంపిల్ తీసుకుంటారు. ఆ 5వేల శాంపిల్ సర్వే తో ఏ పార్టీ వస్తుందో డిసైడ్ చేసేస్తారు. ఇదెక్కడి కామెడీ గురూ!