TELANGANA ASSEMBLY ELECTIONS: కేసీఆర్‌పై పోటీకి సిద్ధం అంటున్న ఈటెల.. రెండు చోట్లా పోటీకి రెడీ..?

కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలోనే ఈటెల ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ఈటెల.. ఆ మాటల్ని ఏవో రాజకీయంగా అన్నారని చాలా మంది భావించారు. అయితే, అప్పుడు చెప్పినట్లుగానే ఈటెల ఈసారి నిజంగానే కేసీఆర్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 08:55 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. తాను సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌తోపాటు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లోనూ పోటీ చేస్తానని వెల్లడించారు. ఈటెల గురువారం హుజురాబాద్‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానన్నారు.

“గత ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. నాకు పరిచయం లేని వాళ్లు కూడా నా కోసం పని చేశారు. ఈసారి నన్ను గెలవనియ్యమని కొందరు అంటున్నారు. కానీ ప్రజలు అనుకుంటేనే అది అవుతుంది. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్‌లో కూడా ఆయనపై పోటీ చేస్తా. ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను బొందపెట్టాలి. సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడవద్దు. గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లా” అని ప్రసంగించారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలోనే ఈటెల ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ఈటెల.. ఆ మాటల్ని ఏవో రాజకీయంగా అన్నారని చాలా మంది భావించారు. అయితే, అప్పుడు చెప్పినట్లుగానే ఈటెల ఈసారి నిజంగానే కేసీఆర్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

మరోవైపు ఇంతకాలం వరకు ఈ అంశంపై వేరేగా ప్రచారం జరిగింది. హుజురాబాద్‌లో ఈటల భార్య జమున పోటీ చేస్తారని, గజ్వేల్ లేదా మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఈటెల రెండు చోట్ల నుంచి పోటీకి దిగుతుండటం విశేషం. కాగా, ఈటెల రెండు చోట్ల నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అనుమతిస్తుందా? లేదా..? అనేది చూడాలి.