KCR Vs Etela Rajender: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. మూడు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడంతో.. పొలిటికల్ సీన్ మరింత రసవత్తరంగా మారింది. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. పార్టీల గెలుపోటములను పక్కన పెడితే బరిలో నిలిచే అభ్యర్థుల మధ్య పోటీ స్ట్రాంగ్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
ఐతే గజ్వేల్ నుంచి బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నారని మొదటి నుంచి ప్రచారం జరగగా.. కమలం పార్టీ ఈ మధ్య ప్రకటించిన మొదటిజాబితాలో ఆయన పేరు ఉంది. దీంతో ఈటల వర్సెస్ కేసీఆర్ పోరు నిజమేనని తేలింది. హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల పోటీ చేయబోతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఈటల తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గజ్వేల్ బరిలో కేసీఆర్‌ను ఢీకొట్టి ఈటల సత్తా చాటే చాన్స్ ఉందా..? అసలు ఈటల గెలుపు సాధ్యమా..? గజ్వేల్‌లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయ్..? ఇలా రకరకాల చర్చ సాగుతోంది. నిజంగా గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేంత సత్తా ఈటలకు ఉందా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అని మరికొందరు సమధానం చెప్తున్నారు. ప్రజాదరణ విషయంలో కేసీఆర్‌కు దాదాపు సమానంగా ఉంటారు ఈటల. దీనికితోడు గతంలో బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్నారు. గతంలో కారు పార్టీ విజయంలో ఈటల కీలక పాత్ర పోషించారు కూడా.
గత కొన్నాళ్లుగా గజ్వేల్‌పై ఈటల ప్రత్యేక దృష్టిసారించారు. కేసీఆర్ అసంతృప్తవాదులను తన వైపు తిప్పుకోవడం.. మెల్లగా తన పరిధిని పెంచుకోవడంలాంటివి చేస్తూ వచ్చారు. గజ్వేల్‌లోని కొందరు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఈటలకు మద్దతు తెలిపారు. దీనికితోడు ఈటల సొంత సామాజికవర్గం అయిన ముదిరాజ్‌లంతా బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారు. వారిని ఈటల తనవైపు తిప్పుకునే చాన్స్ ఉంది. ఇలాంటి పరిణామాలన్నింటి మధ్య.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఈటల ఓడిస్తారా లేదా అన్నది పక్కనపెడితే.. ఆసక్తికర యుద్ధం మాత్రం ఖాయం అన్నది క్లియర్‌గా అర్థం అవుతోంది. గజ్వేల్‌లో ఓడితే ఈటలకు పోయేదేమీ లేదు.. గెలిచినా, గట్టి పోటీ ఇచ్చినా అది సంచలనంగానే మారుతుంది. ఓవరాల్‌గా ఈసారి గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు షానా దినాల్ యాదికుంటయ్ అన్నది మాత్రం క్లియర్.