ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ పని చేసి.. తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశ సేవ నుంచి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టాడు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ లోనూ కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ దక్కింది. 1962లో సూర్యాపేటలో జన్మించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఎస్సీలో డిగ్రీ చేశారు. తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. పైలట్ గా దేశసేవ చేశారు. రాష్ట్రపతి భవన్ లోనూ పనిచేసే అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఫారెన్ టూర్స్ లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ బాధ్యతలను ఉత్తమ్ చూసేవారు. దేశ సేవను వదిలిపెట్టి.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకొని రాజకీయాల్లోకి వచ్చారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి 1999 ఎన్నికల్లో కోదాడ నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018లో కూడ హుజూర్ నగర్ స్థానం నుంచే ఉత్తమ్ కుమార్ విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా కొనసాగారు. ఈ ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచి.. రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో గృహ, బలహీన వర్గాల మంత్రిగా పనిచేశారు. 2015-2021 మధ్య టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని బుజ్జగించి… రేవంత్ కేబినెట్ లో పదవికి ఒప్పించింది.