ధనసరి అనసూయ.. అలియాస్.. సీతక్క.. ఈమె అంటే తెలియని వాళ్ళు ఉండరేమో. అడవుల్లో ఉండే గిరిజన బిడ్డలకు ఎప్పుడూ అండగా.. నిలుస్తూ నిత్యం వార్తల్లో ఉండే గిరిజన బిడ్డకు ఇప్పుడు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో సీతక్కకు చోటు దక్కింది. ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు సీతక్క.. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. మావోయిస్ట్ నేపథ్యం ఉన్న సీతక్క కోవిడ్ టైమ్ లో నల్లమల అడవుల్లోని మారుమూల గ్రామాలు, గూడేలకు కాలినడకన వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు, డబ్బులు అందించి.. గిరిజన బిడ్డల గోస తీర్చారు.
సీతక్క రాజకీయాల్లోకి రాక ముందు.. 15ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. 1988లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు సీతక్క టెన్త్ చదువుతున్నారు. ఫూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొంది.. సీతక్క విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా పనిచేశారు. తర్వాత మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని NTR పిలుపు ఇవ్వడంతో.. మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చారు సీతక్క.
2004లో మొదటిసారి తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సీతక్క.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి.. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో మళ్ళీ నిలబడ్డా ఓడిపోయారు. అప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పిన సీతక్క కాంగ్రెస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. పార్టీకి సీతక్క చేస్తున్న సేవలు గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం, 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అవడంతో .. సీతక్కకు మంత్రి పదవి దక్కింది. తాను ఏ స్థాయిలో ఉన్నా.. ప్రజా సేవకురాలినే అంటున్నారు సీతక్క.