మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మరోపక్క ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశౄరు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ స్వయంగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా నాలుగు అంశాలను తమ ఫిర్యాదులో కీలకంగా మెన్షన్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేశారు అనేది కాంగ్రెస్ ప్రధాన వాదన. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు 6 వేల కోట్లు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుబంధు నిధులను ఇందుకోసం వాడుతున్నారు అనేది మరో ఆరోపణ. ఇక భూ రికార్డులు కూడా చాలా వరకూ మార్చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
అసైన్డ్ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని ఈసీని కోరినట్టు చెప్పతారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని అధికారులను కోరారు. ఇక డిసెంబర్ 4న కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కేబినెట్ మీటింగ్ గురించి కూడా తమ పిర్యాదులో పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున.. ఈ మీటింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు. మరి కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై.. ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.