తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మరో పాపులర్ స్కీమ్.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఆరు గ్యారంటీల్లో ఈ పథకం కూడా ఉంది. అయితే దీన్ని ఎలా అమలు చేయాలి అన్నదానిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటకలో ఎలా అమలవుతుందో చూసేందుకు తెలంగాణ ఆర్టీసికి చెందిన నలుగురు అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది.
తెలంగాణలో త్వరలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం రాబోతోంది. దీనిపై ఇప్పటికే మహిళలంతా ఎదురు చూస్తుండగా.. మీమ్స్, జోకులు కూడా సోషల్ మీడియాలో పేలుతున్నాయి. సరే.. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలను ఎలా ఖరారు చేయబోతోంది అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఈ లోగా ప్రభుత్వం అడిగితే రెడీగా నివేదిక ఇవ్వడానికి తెలంగాణ ఆర్టీసీ ప్రిపేర్ అవుతోంది. నలుగురు అధికారుల బృందం బెంగళూరుకు వెళ్ళి.. కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ టికెట్ సిస్టమ్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుంటోంది.
దక్షిణ భారత దేశంలో మొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తమిళనాడులో అమల్లోకి వచ్చింది. అక్కడ నగరం, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అయితే వాళ్ళకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉన్న బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లో మాత్రమే ఫ్రీగా ట్రావెల్ చేసే ఛాన్స్ మహిళలకు ఉంది. అదే కర్ణాటకలో మాత్రం.. రాష్ట్రమంతటా ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో అయిన సిస్టమే తెలంగాణలోనూ అమలు చేసే ఛాన్సుంది.
అప్పుడు కర్ణాటకలో లాగే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వాళ్ళకోసం జీరో టికెట్ విధానం అమలు చేసే అవకాశముంది. అంటే మహిళలకు ఇచ్చే టిక్కెట్లపై ప్రయాణ ఛార్జీని సున్నాగా చూపిస్తారు.
దీనివల్ల ఆరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేశారన్నది లెక్క తెలుసుకోడానికి ఆర్టీసికి ఉపయోగపడతుంది. కర్ణాటకలో ఇలాంటి పద్దతే అమల్లో ఉంది. తెలంగాణలో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఫ్రీ టికెట్ విధానం అమలుకు ఏటా 2 వేల 200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే నెలకు 185 కోట్ల రూపాయల దాకా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసికి రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. అదే పల్లెవెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేస్తే.. ఏటా 750 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అసలే తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. అందువల్ల ఫ్రీ టికెట్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే మరింత అప్పుల్లోకి కూరుకుపోయే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.