Komatireddy Rajgopal Reddy: రాజగోపాల్ చేరికతో కాంగ్రెస్‌కు నష్టమేనా ?

రాజగోపాల్ చేరికతో లాభమే తప్ప నష్టం లేదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్‌.. ఆయన ఎంట్రీకి దారులు క్లియర్ చేస్తే.. జనాల్లో మాత్రం భిన్నమైన చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 03:59 PM IST

Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో గెలిచి.. బీజేపీలోకి వెళ్లి సీఎం అవుతా అన్నారు. కట్‌ చేస్తే అప్పుడు ఆగిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా సాగుతున్న సమయంలో.. మళ్లీ బీజేపీలోకి వెళ్లాలనే ఆశ పుట్టింది ఆయనకు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేసి మరీ.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నికలో ఓడిపోయారు.

కారణం ఏదైనా మళ్లీ బీజేపీ అంటే ఆయనకు నచ్చకపోవడం స్టార్ట్ అయింది. కమలం పార్టీని వదిలేసి.. మళ్లీ పాత గూటికి చేరుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారమే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న నేతను, జంపింగ్‌లకు సిద్ధంగా ఉండే నాయకుడిని.. మళ్లీ గూటికి చేర్చుకుంటే.. అదీ ఎన్నికల ముందు చేర్చుకుంటే.. కాంగ్రెస్‌కు లాభమా నష్టమా అనే చర్చ సాగుతోంది. రాజగోపాల్ చేరికతో లాభమే తప్ప నష్టం లేదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్‌.. ఆయన ఎంట్రీకి దారులు క్లియర్ చేస్తే.. జనాల్లో మాత్రం భిన్నమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ వీక్ అయిందని.. బీజేపీకి వెళ్లారు. ఇప్పుడు బీజేపీ వీక్ ఉంది అవుకొని మళ్లీ కాంగ్రెస్‌కు వస్తున్నారు. ఇలా గోడ మీద పిల్లిలా వ్యవహరించి.. స్థిరత్వం లేని రాజగోపాల్‌ను చేర్చుకోవడం ఏ పార్టీకైనా ఇబ్బందే అంటూ.. కొత్త చర్చ జరుగుతోంది. ఇదంతా వదిలేస్తే.. ఉప ఎన్నిక సమయంలో మునుగోడులో రకరకాల పోస్టలు వెలిశాయ్.

కాంట్రాక్టులకు రాజగోపాల్ అమ్ముడుపోయారని.. డబ్బుల కోసమే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని అప్పట్లో పోస్టలు వెలిశాయ్. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే.. అమిత్‌ షాతో బేరాలాడిన నీచుడివి అంటూ.. పోస్టర్లు రాసుకొచ్చారు. ఈ పోస్టర్ల వెనక కాంగ్రెస్‌ ఉంది అన్నది క్లియర్‌. దీంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా రాజగోపాల్‌ టార్గెట్‌గా ఘాటు విమర్శలు గుప్పించారు ఆసమయంలో ! అన్ని మాటలు అని, అన్ని ఆరోపణలు గుప్పించి.. ఇప్పుడు అదే నాయకుడిని పార్టీలో చేర్చుకుంటే.. జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అంటున్నారు. ఐతే ఇది జరుగుతుంది.. ఇదే జరుగుతుంది అనడానికి లేదు. ఐనా రాజగోపాల్‌ చేరికతో కాంగ్రెస్‌లో కొత్త పరిణామాలు చోటుచేసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.