తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. పదేళ్ళ పాలనపై జనం విసుగెత్తిపోయారు. పథకాలు ఎన్ని పెట్టి ఊరించినా.. కేసీఆర్ కుటుంబం అహంకారమే ఆయన్ని ఓడించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తెలంగాణలో బీఆర్ఎస్ ఓడితే.. మరి పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ? అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీవ్ర స్థాయిలో ఉందని గ్రౌండ్ లెవల్ పరిస్థితి తెలుస్తోంది. ఇక్కడ ప్రభావం అక్కడ కూడా చూపిస్తుందా.. జగన్ ని కూడా ఏపీ జనం ఓడిస్తారా ?
తెలంగాణలో కేసీఆర్ ఓటమి.. తరువాత ఆంధ్రలో జగన్ ఓటమి తప్పదా.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ఇదే. వ్యక్తిగత పథకాలను ఓ రకంగా కేసీఆర్ మించి ఏపీలో ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ అభివృద్ధి పూర్తిగా పక్కనపెట్టేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది అంతా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. తన ప్రభుత్వ హయాంలో అవినీతి అవకాశం లేదంటూ మొదటి ఏడాది వరకూ బిల్డప్ ఇచ్చినా.. ఇప్పుడు విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందన్న విమర్శలున్నాయి. పనులు, పదవులు కూడా సొంత సామాజిక వర్గానికే తప్ప.. వేరే వర్గాల వారిని దగ్గరకు కూడా రానీయడం లేదంటున్నారు. రాయలసీమ కంటే అధికంగా ఉన్న కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో దళిత సామాజిక వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. రెడ్డి సామాజిక వర్గంలోనే ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పథకాలు మేలు చేస్తాయని జగన్ అతని మంత్రివర్గం పూర్తిగా భ్రమలో ఉన్నారు. అది కొంత శాతం పని చేసినప్పటికీ.. అధిక శాతం వ్యతిరేకతే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ చేత్తో ఇస్తూ.. ఈ చేత్తో తీసుకున్న చందంగా జగన్ పరిస్థితి తయారైందని మధ్యతరగతి జనం మండిపడుతున్నారు. పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ.. మిడిల్ క్లాస్ పై నిత్యావసరాలతో సహా అన్నింటి ధరలు పెరగడం, ట్యాక్సులు మోతపై మండిపడుతున్నారు. అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో పెద్ద పెద్ద పరిశ్రమలు, దిగ్గజ కంపెనీలేవీ ఏపీకి రావడం లేదు. దాంతో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి లేకుండా పోతోంది. అందుకే యూత్ కూడా జగన్ సర్కార్ పై రగిలిపోతున్నారు. తెలంగాణలో లాగే ఏపీ నిరుద్యోగ యువత కూడా వచ్చే ఎన్నికల్లో తిరగబడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితులు చూస్తుంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. అక్కడ కూడా జనం మార్పును కోరుకునే అవకాశముంది. అంతే కాదు జగన్ ఓడిపోవడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబుకు సాయం చేసే ఛాన్సుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న సత్సంబంధాలు కచ్చితంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీకి అన్ని విధాలా సాయం చేస్తాయని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సపోర్టు, జగన్ మీద జనంలో ఉన్న వ్యతిరేకత, ఆర్థిక వనరులు… ఇవన్నీ కలుపుకొని ఏపీలో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశాలున్నాయి. జగన్ ఇంటికి పోక తప్పేలా లేదు.