TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణను కాంగ్రెస్‌ లైట్‌ తీసుకుందా..!

రేపు ఢిల్లీలో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో స్క్రీనింగ్‌ కమిటీ మీటింగ్‌ నిర్వహించబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. దీని తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర ఉంది. ఆ యాత్ర తరువాత తమ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ అనౌన్స్‌ చేసింది.

  • Written By:
  • Updated On - October 12, 2023 / 06:38 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నిక నగారా మాగింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ మాత్రం ఒక అడుగు ముందే ఉండి ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నలుగురిని కూడా దాదాపు ఖరారు చేసింది. అన్ని పార్టీలు సరిగ్గానే ఉన్నా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం మాత్రం అటూ ఇటూగా కనిపిస్తోంది. దాదాపు నెల రోజుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేస్తూనే ఉంది. కానీ ప్రకటించింది మాత్రం లేదు.

రేపు ఢిల్లీలో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో స్క్రీనింగ్‌ కమిటీ మీటింగ్‌ నిర్వహించబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. దీని తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర ఉంది. ఆ యాత్ర తరువాత తమ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ అనౌన్స్‌ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ఆల్రెడీ వచ్చేసింది. ఎన్నికలకు కనీసం రెండు నెలల టైం కూడా లేదు. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నత్తనడకన నడుస్తోంది. ఇక అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కమిటీ ఏర్పాటు చేసి దానికి జానా రెడ్డిని చైర్మన్‌గా పెట్టారు. స్వయంగా ఆయనే తన ఇద్దరు కొడుకులకు టికెట్లు అడుగుతున్నారు. కానీ, కాంగ్రెస్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్‌ ఇవ్వొద్దనే నిబంధన ఉంది. జానా రెడ్డి వేరేవాళ్లను బుజ్జగించడం తరువాత సంగతి.. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకుండా జానా రెడ్డిని ఎవరు బుజ్జగించాలి అనేది కీలకంగా మారింది. ఇప్పటికే దాదాపు 84 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరు.

ఇక ఉన్న 35 స్థానాల్లో కూడా పోటీ గట్టిగా లేదు. తెలంగాణలో చిన్న పార్టీలుగా ఉన్న బీఎస్పీ, జనసేన కూడా అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. షర్మిల కూడా తన అభ్యర్థుల లిస్ట్‌ రెడీ చేసింది. కానీ గెలుపు అవకాశాలు ఉన్న కాంగ్రెస్‌ మాత్రం నత్త నడకన సాగుతోంది. కానీ అధికారంలోకి వచ్చేది మేమే అంటూ మాటలతో కోటలు కడుతోంది. ఇదంతా చూస్తుంటే అసలు కాంగ్రెస్‌ తెలంగాణను లైట్‌ తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న పెద్ద మైనస్‌ అంతర్గత పోరు. ఆ పోరు ఇంకా అలాగే ఉంది. మరోపక్క టికెట్లు వస్తాయో లేదో అన్న డైలమాలో చాలా మంది నేతలు ఉన్నారు. కనీసం ఎన్నికలకు వారం రోజులు ముందైనా టికెట్లు ప్రకటిస్తారా అని అసంతృప్తితో వేచి చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే అధికారం కాదు కదా.. కనీసం డిపాజిట్లు కూడా రావంటున్నారు విశ్లేషకులు.