IT RAIDS ON CONGRESS: బీజేపీ (BJP) అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఐటీ రైడ్స్ (IT RAIDS) జరుగుతాయని ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో ఆరోసిస్తున్నాయి. అదే సీన్ ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ జరుగుతోంది అధికార BRS పార్టీ లీడర్లపై కాదు. కాంగ్రెస్ (CONGRESS) లీడర్లు టార్గెట్‌గా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఆ పార్టీ మహేశ్వరం అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మీద ఐటీ శాఖ దాడులు చేసింది. దీంతో ఈ ఐటీ రైడ్స్ మీద తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది.
మొన్నటిదాకా ఐటీ రైడ్స్, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల ఇళ్ళల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. అసలే తెలంగాణలో కాంగ్రెస్ మంచి పీక్ స్టేజ్‌లో ఉంది. బీఆర్ఎస్‌తో నువ్వా నేనా అంటూ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ టైమ్‌లో మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ లీడర్ల ఇళ్ళల్లోనూ ఐటీ శాఖాధికారులు సోదాలు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌తో పాటు 10 ఏరియాల్లో సోదాలు జరిగాయి. లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్‌లో కూడా తనిఖీలు చేశారు. బడంగ్‌పేట మేయర్ పారిజాత ఇంట్లోనూ సెర్చ్ చేశారు. తిరుపతికి వెళ్ళిన తనను ఇంటికి రావాలని ఆదేశించారని ఆమె ఆరోపించారు. బాలాపూర్ లడ్డూని వేలంలో దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సెర్చ్ చేస్తున్నారు.
ఈ ఐటీ రైడ్స్‌పై పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (REVANTH REDDY) స్పందించారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆర్ఎస్‌కు అర్థమైందని, అందుకే బీజేపీతో కలిసి కాంగ్రెస్ లీడర్ల మీద ఐటీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌ను మళ్ళీ గెలిపించాలని మోదీ కంకణం కట్టుకున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఈడీ కేసులో ఉన్న కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మండిపడుతోంది కాంగ్రెస్. ఎన్నికల వేళ ఐటీ అధికారులు కాంగ్రెస్ లీడర్ల ఇళ్ళల్లోనే సోదాలు చేయడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. మరి బీఆర్ఎస్ లీడర్లపైనా దాడులు మొదలవుతాయా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఐటీ రైడ్స్‌తో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నారు.