JANASENA: పవన్‌తో కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు..?

తెలంగాణలో జనసేన పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్య నేతలతో పవన్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పోటీ చేసే అంశంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో కచ్చితంగా పోటీ చేసి తీరాల్సిందే అని నేతలు పవన్‌కు సూచించారు.

  • Written By:
  • Updated On - October 18, 2023 / 03:02 PM IST

JANASENA: తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. ఇరు పార్టీలమధ్య పొత్తు లేదా అవగాహనకు అవకాశం ఉన్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్‌ను కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్ కోరారు. దీనిపై స్పందించిన పవన్ పార్టీలో చర్చించి నిర్ణ‍యం తీసుకుంటామన్నారు. గతంలో 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చామని, తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అండగా నిలిచామన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో జనసేన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో జనసేన పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్య నేతలతో పవన్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పోటీ చేసే అంశంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో కచ్చితంగా పోటీ చేసి తీరాల్సిందే అని నేతలు పవన్‌కు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రస్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వినతి మేరకు పోటీ నుంచి తప్పుకొని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. అయితే, ఈసారి ఎన్నికలకు సంబంధించి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని పవన్ చెప్పారు. అందువల్ల అన్ని అంశాలు పరిశీలించి, రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై నిర్ణ‍యం తీసుకుంటామని పవన్ నేతలకు చెప్పారు.

మరోవైపు ఏపీలో మాత్రం బీజేపీ, జనసేన కలిసే సాగుతామని ఎప్పట్నుంచో చెబుతున్నాయి. అయితే, టీడీపీతో జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా.. లేదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ, ఈ విషయంలో బీజేపీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కానీ, బీజేపీ మత్రం తమతో కలిసొస్తుందని జనసేన భావిస్తోంది. తెలంగాణలో జనసేన పోటీ చేయబోయే నియోజవకర్గాలను కూడా ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం బీజేపీ నుంచి వచ్చిన వినతి నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.