BJP-JANASENA: బీజేపీలో జనసేన చిచ్చుపెట్టిందా..? ఆ 31 స్థానాలు పెండింగ్‌లో ఎందుకు..?

ఇప్పటివరకు తాము పోటీ చేసే జాబితాను మాత్రమే బీజేపీ ప్రకటించింది. జనసేన ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది.. ఎవరికి టికెట్ ఇస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇదంతా ఎలా ఉన్నా.. బీజేపీలో జనసేన పార్టీ చిచ్చు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Updated On - November 2, 2023 / 06:56 PM IST

BJP-JANASENA: ఏపీలో కలిసి నడుస్తున్నామని అనుకుంటున్న బీజేపీ, జనసేన.. అదే పొత్తును తెలంగాణలోనూ కొనసాగించబోతున్నాయ్. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన కమలం పార్టీ.. మరో 31 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటివరకు తాము పోటీ చేసే జాబితాను మాత్రమే బీజేపీ ప్రకటించింది. జనసేన ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది.. ఎవరికి టికెట్ ఇస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇదంతా ఎలా ఉన్నా.. బీజేపీలో జనసేన పార్టీ చిచ్చు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌లో మూడు సీట్ల కోసం జనసేన పట్టిన పట్టు వీడడం లేదు. బీజేపీ నేతలు కూడా.. వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా రవి యాదవ్‌ను రంగంలోకి దింపాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దలను డిమాండ్‌ చేశారు. ఒకవైపు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి పార్టీకి రాజీనామా చేయడం.. అదే సమయంలో కొండా.. అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు కారణమవుతోంది. ఇక అటు కూకట్‌పల్లి సీటుపై జనసేన ఆశలు పెట్టుకుంది. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ వదిలేస్తుందన్న సమాచారంతో.. వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోకల్‌ కేడర్‌ ఒత్తిడికి అధినాయకత్వం తలొగ్గుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌లాంటి నేతలు టికెట్‌ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటు జనసేనకు పొత్తులో వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. భారీగా ఆశావహులు కనిపిస్తున్న కీలక స్థానాలను బీజేపీ వదులుకుంటే.. కమలం పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. కోమటిరెడ్డి, వివేక్ ఎగ్జిట్‌తో ఇప్పటికే బీజేపీ ఇబ్బందులు పడుతోంది. దీంతో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది కమలం పార్టీ. ఇక జనసేన పొత్తుపై ఎటు తేలకపోవడంతో మొత్తంగా 31 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది బీజేపీ. దీంతో ఆయా స్థానాల్లోని బీజేపీ నేతల్లో టెన్షన్‌ కనిపిస్తోంది. ప్రస్తతం పవన్‌ ఇటలీ టూర్‌లో ఉండటంతో పొత్తుపై చర్చలు సాగట్లేదు. పవన్‌ ఇటలీ నుంచి వచ్చిన తర్వాతే మిగిలిన సీట్లపై క్లారిటీ రానుంది. మరోవైపు జనసేన 20 నుంచి 25 సీట్లు అడుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించే స్థానాలపై ఉత్కంఠ నెలకొంది.