Telangana Assembly Elections: బీఆర్ఎస్‌లోకి జిట్టా.. 14 ఏళ్ల తర్వాత సొంత పార్టీలోకి..!

బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జిట్టా శుక్రవారం హైదరాబాద్‌లో, కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న జిట్టా 2009లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 05:11 PM IST

Telangana Assembly Elections: సీనియర్ పొలిటీషియన్, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్టారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జిట్టా శుక్రవారం హైదరాబాద్‌లో, కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న జిట్టా 2009లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. మళ్లీ 14 ఏళ్లకు సొంత గూటికి చేరడం విశేషం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు.

అయితే, 2009లో టీడీపీతో పొత్తు కారణంగా ఆయనకు భువనగిరి అసెంబ్లీ టిక్కెట్ దక్కలేదు. దీంతో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అలా 2009, 2014, 2018లో పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్‌ నుంచి బయటకి వచ్చిన కొంత కాలానికి వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సార్ మరణంతో ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. కానీ, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో ఆ పార్టీ నుంచి బయటకువచ్చారు. తర్వాత యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. తర్వాత రెండేళ్లక్రితం బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు. అయితే, ఇటీవల జిట్టాకు బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదు. ముఖ్యంగా బండి సంజయ్‌ను తప్పించాక బీజేపీలో జిట్టాకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, పార్టీ సస్పెండ్ చేసింది. తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో కూడా సరైన ప్రాధాన్యం దక్కలేదు. దీంతో నెల తిరక్కుండానే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు.

తాజాగా బీఆర్ఎస్‌లో చేరారు. గతంలో పలుసార్లు అయనకు బీఆర్ఎస్ పలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ ఆయన పార్టీలో చేరలేదు. ఈసారి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో గులాబీ కండువా కప్పుకొన్నారు. కేటీఆర్ జిట్టాకు స్వాగతం పలికారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జిట్టా పోటీ చేసే అవకాశం లేదు.