తెలంగాణలో అధికారం మారడంతో మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు కూడా BRS నుంచి కాంగ్రెస్ కు మారబోతున్నాయి. చాలా మున్సిపాలిటీల్లో BRS కౌన్సిలర్లు గోడ దూకుతున్నారు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతూనే.. BRS ఛైర్ పర్సన్స్ పై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ వలసలు, అవిశ్వాసాలను ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో పదేళ్ళుగా BRS అధికారంలో ఉండటంతో.. గతంలో కాంగ్రెస్, ఇతర పార్టీల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లంతా హస్తం గూటికి చేరుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ల మీద కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలను రెడీ చేశారు. మున్సిపాలిటీల పదవీకాలం 2024 జనవరితో నాలుగేళ్ళు పూర్తవుతాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల నాటికల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్న 36 మంది BRS కౌన్సిలర్లలో 17 మంది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దాంతో ఇక్కడ కాంగ్రెస్ బలం 27కు చేరుకుంది. మిగిలిన BRS కౌన్సిలర్లను మెదక్ లోని ఫామ్ హౌస్ కు తరలించింది ఆ పార్టీ అధిష్టానం. లక్సెట్టి పేట మున్సిపాలిటీలోనూ అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిలర్లు రెడీ చేశారు.
మూడేళ్ళు పూర్తి చేసుకున్న.. 22 మున్సిపాలిటీల్లో గత ఏడాదిలోనే అవిశ్వాన తీర్మానాలను ప్రతిపాదించారు. పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో.. కొందరు ఛైర్ పర్సన్లు కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిస్థితి ఏర్పడటంతో భయపడింది BRS ప్రభుత్వం. దాంతో అప్పటిదాకా 3 యేళ్ళ తర్వాతే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి ఉన్న వెసులుబాటును.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ళకు పెంచుతూ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఛైర్ పర్సన్లు, మేయర్లపై అవిశ్వాసం పెట్టాలంటే.. వాళ్ళు పదవుల్లోకి వచ్చిన నాలుగేళ్ళ తర్వాతే చేపట్టాలి. ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై కూడా అప్పట్లో సంతకం పెట్టలేదు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలవడంతో కౌన్సిలర్లు కూడా అవిశ్వాసాలపై ముందుకు వెళ్ళలేదు.
ఇప్పుడు 2024 జనవరి నాటికి మున్సిపల్ ఛైర్ పర్సన్స్ పదవులు చేపట్టి నాలుగేళ్ళు పూర్తవుతాయి. ప్రభుత్వం చేసిన చట్ట సవరణల ప్రకారం జనవరిలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడానికి అవకాశం ఏర్పడింది. న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం లేదు. దాంతో ఇప్పుడు మెజారిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. తమ ఛైర్ పర్సన్స్, మేయర్లపై నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ నోటీసులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తారు. 30 రోజుల్లోపు ఈ ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. వచ్చే జనవరిలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే మున్సిపాలిటీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సొంతం చేసుకోడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.