K Madan Mohan Rao: కేసీఆర్‌పై పోటీకి సిద్ధమైన ఎర్రబెల్లి అల్లుడు.. కాంగ్రెస్ టిక్కెట్ ఆయనకే..!

కాంగ్రెస్ పార్టీ.. కామారెడ్డిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ, షబ్బీర్ అలీపై అంత సానుకూలత లేదు. ప్రజల్లో ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. అందులోనూ కేసీఆర్‌ను ఢీకొట్టడం అంత సాధారణ విషయం కాదు.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 04:45 PM IST

K Madan Mohan Rao: కామారెడ్డిలో కేసీఆర్‌పై కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే ఉత్కంఠకు తెరపడే ఛాన్స్ ఉంది. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున మదన్ మోహన్ రావును పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు మదన్ మోహన్ రావు అల్లుడు కావడం విశేషం. కొంతకాలంగా మదన్ మోహన్ రావు కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. మదన్‌కు స్థానికంగా మంచి పట్టుంది. సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో కామారెడ్డి పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పలువురు బీఆర్ఎస్ నేతలు ఇక్కడ వరుసగా పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్‌న ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం గంప గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు కాబట్టి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో బీఆర్ఎస్‌ను ఓడించడం ఇక్కడ ఇతర పార్టీలకు సవాలుగా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ.. కామారెడ్డిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ, షబ్బీర్ అలీపై అంత సానుకూలత లేదు. ప్రజల్లో ఆయనపై కొంత వ్యతిరేకత ఉంది. అందులోనూ కేసీఆర్‌ను ఢీకొట్టడం అంత సాధారణ విషయం కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ మరో ప్రత్యామ్నాయం కోసం చూసింది.

మదన్ మోహన్ రావు అయితేనే.. కేసీఆర్‌ను గట్టిగా ఎదుర్కోగలడని కాంగ్రెస్ నమ్ముతోంది. కొంతకాలంగా ఇక్కడ మదన్ మోహన్ రావు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయనపై షబ్బీర్ అలీ వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నప్పటికీ.. ఆయనకు ప్రజల్లో ఆదరణ మాత్రం ఉంది. పైగా షబ్బీర్ అలీతో పోలిస్తే యువతలో ఆయనకు గుర్తింపు ఉంది. ఇలాంటి అంశాలు మదన్ మోహన్ రావుకు కలిసొచ్చే అవకాశం ఉంది. షబ్బీర్ అలీ, మదన్ మోహన్ రావు.. ఇద్దరిలో మదన్ అయితేనే బెటర్ అని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రావు వైపే మొగ్గు చూపుతోంది. ఈ కారణంగానే తాజాగా ప్రకటించిన మొదటి జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేదు. మదన్ ఎంపికపై తుది జాబితాలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.