Kaleswaram ATM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్, కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ వినూత్న పంథా అనుసరిస్తోంది. తాజాగా కాళశ్వరం ఏటీఎం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసి, బీఆర్ఎస్ అవినీతిపై ప్రచారం కల్పిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ అండ్ కో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శిస్తుంటాయి. దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు తరచూ ప్రస్తావిస్తుంటాయి. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రతిపక్షాలకు మరో అస్త్రం దొరికినట్లైంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఇందుకోసం ఒక వినూత్న పద్ధతి ఫాలో అయింది. గులాబీ రంగులో కాళేశ్వరం ఏటీఎంను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఏటీఎం నుంచి లక్ష కోట్ల రూపాయల నోట్లు వస్తున్నాయని ప్రచారం ప్రారంభించింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కాం కాళేశ్వరం అంటూ ఏటీఎంపై పేర్కొన్నారు. కాళేశ్వరం కరప్షన్ రావు పేరుతో నోట్లను ముద్రించి జనాలకు పంచుతున్నారు. ప్రాజెక్ట్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో దీని ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్.. అక్కడి అధికార బీజేపీపై గతంలో ఇలాగే ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
అక్కడ అప్పటి సీఎం బొమ్మై ఫొటో, పేటీఎం కోడ్ ముద్రించి వాల్ పోస్టర్లు వేయించింది. ఈ కోడ్ స్కాన్ చేస్తే 40 శాతం కమిషన్ సీఎం అంటూ, ఇతర సైట్ వివరాలు కనిపించేవి. ఈ ప్రచారం అక్కడ కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఇదే తరహా ప్రచారాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రారంభించింది. మరి ఈ ప్రచారం ఆ పార్టీకి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.