TELANGANA ASSEMBLY ELECTIONS: కేసీఆరా.. మజాకా.. కాంగ్రెస్‌ను టైం చూసి కొడ్తున్న కేసీఆర్‌..

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులపై.. బీఆర్ఎస్‌ కన్నేస్తోంది. మంచి పేరు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి చేర్చుకొని.. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రోత్సహించాలని వ్యూహం రచిస్తోంది. దీనికి తగినట్లే ప్రతీ నియోజకవర్గంలోనూ టికెట్ దక్కని నేతలను పార్టీలోకి చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 01:33 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్‌ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే యుద్ధం ఉండబోతుందన్నది క్లియర్‌గా అర్థం అవుతోంది. ఐతే నిన్నటివరకు పోటీ చెయ్యడానికి అభ్యర్థులు కరవు అయినట్లు కనిపించిన కాంగ్రెస్.. ఇప్పుడు వరుస చేరికలతో బిజీగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీభవన్ కిక్కిరిసిపోతోంది. బీజేపీ బలహీనపడడంతో.. ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్‌కు, ప్రతిపక్ష కాంగ్రెస్‌‌కు మధ్యే అన్నట్లుగా పరిస్థితి మారింది. బీఆర్ఎస్‌లో అసంతృప్తులందరికీ కాంగ్రెస్ ఇప్పుడో వేదికగా మారింది. కేసీఆర్ వ్యతిరేక వర్గానికి, ప్రభుత్వంలోని అసంతృప్త నేతలకు.. కాంగ్రెస్ నిలయంగా మారింది.

దీంతో కాంగ్రెస్‌లో టికెట్లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ప్రతీ నియోజకవర్గానికి మూడు నుంచి నలుగురు అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. దీంతో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా ముగ్గురు తిరుగుబాటు జెండా ఎగరవేసే చాన్స్ ఉంది. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు వివిధ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కాంగ్రెస్ హామీ ఇస్తున్నా.. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయ్. మిగతా వారిని ఎలా అకామిడేట్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది. దీన్నే బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటోంది. ప్లేస్, టైం చూసి కొట్టడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరు. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే చేస్తున్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులపై.. బీఆర్ఎస్‌ కన్నేస్తోంది. మంచి పేరు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి చేర్చుకొని.. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రోత్సహించాలని వ్యూహం రచిస్తోంది. దీనికి తగినట్లే ప్రతీ నియోజకవర్గంలోనూ టికెట్ దక్కని నేతలను పార్టీలోకి చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది. మెదక్, మల్కాజ్‌గిరిలో అనుసరించిన వ్యూహాలనే మిగిలిన స్థానాల్లోనూ ఫాలో కావాలని కారు పార్టీ ఫిక్స్ అయింది.

మైనంపల్లి, ఆయన కుమారుడికి టికెట్ కన్ఫార్మ్ కావడంతో.. మెదక్‌, మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంది. ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు. వాళ్లను వెంటనే తమ పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్‌.. ఒకరికి కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చింది. ఇదే వ్యూహాన్ని మిగిలిన చోట కూడా అమలు చేయబోతోంది. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయ్. కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే.. ఎప్పటి నుంచో పనిచేస్తున్న పాత నేతలు ఎదురుతిరిగే చాన్స్ ఉంది. వాళ్లను అక్కున చేర్చుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తే.. పరిస్థితి అనుకూలంగా మారే చాన్స్ ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది.