Rythu bandhu : రైతు బంధు స్కీమ్ తో ఓట్లు దండుకోవాలని దురాశ, ఆత్రుత, అహంకారమే తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా, అల్లుళ్ళకు లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుబంధు నిధుల జమను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడంపై ఆయన స్పందించారు. హరీష్ వ్యాఖ్యల కారణంగానే రైతుకు బంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంటూ ఆదేశాలివ్వడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రైతుకు 15 వేల రూపాయలను మీ ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
నోటిఫికేషన్ కు ముందే రైతు బంధు ఎందుకివ్వలేదు : భట్టీ
ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రైతు బంధు ఇవ్వడం కుదరదని సీఎం కేసీఆర్ కు తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లక్ష్మీపురంలో ప్రచారంలో రైతుబంధును ఈసీ నిలిపివేయడంపై మాట్లాడారు. రైతుబంధును ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు భట్టి. నోటిఫికేషన్ వచ్చేదాకా ఎందుకు ఆగారు.. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారనీ.. ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు.