తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లలో ఒకరైన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొని.. యువజన కాంగ్రెస్ లో చేరి పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. సేవా కార్యక్రమాల పేరుతో నిత్యం జనంలో తిరిగే కోమటి రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు.
1965లో నల్లగొండలో పుట్టిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. 1980లో హైదరాబాద్ లోని మలక్ పేటలోని హైస్కూల్లో SSC పూర్తి చేశారు. తర్వాత 1982లో పత్తర్ ఘట్టీలోని NB సైన్స్ కాలేజీలో ఇంటర్ చదివారు. 1986లో హైదరాబాద్ CBIT లో బీఈ పట్టా అందుకున్నారు. కోమటిరెడ్డి యువజన రాజకీయాల్లో చరుకుగా పాల్గొన్నారు. 1986లో బీఈ చదివేటప్పుడు… NSUI జిల్లా ఇంఛార్జ్ గా పనిచేశారు. తర్వాత నల్లగొండ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు.
1999లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004, 2009, 2014లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో ఐటీ శాఖా మంత్రిగా కూడా పని చేశారు. 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకసారి, 2011 అక్టోబర్ లో రెండోసారి కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఆ రిజైన్ లెటర్స్ ఆమోదించలేదు.
2011లో తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి… తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి… నల్లగొండలో మూడున్నర కోట్ల రూపాయలతో బాలుర జూనియర్ కాలేజీ, బాలికల వొకేషనల్ కాలేజీలను నిర్మించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను కోమటి రెడ్డి ప్రతియేటా నిర్వహిస్తుంటారు. ఒక అంబులెన్స్ కూడా ఫౌండేషన్ తరపున నడుపుతున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కూడా కోమట్టి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనంలో ఉత్తమ్ తో కలసి గట్టిగా పనిచేశారు. ఇప్పుడు రేవంత్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.