Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ మనసు మార్చుకున్నారా..? పోటీ ఎక్కడి నుంచి..?

మునుగోడు నుంచి పోటీ చేస్తారా.. ఎల్బీనగర్‌ నుంచి నిలుస్తారా.. రాజగోపాల్‌ మాత్రమేనా ఆయన సతీమణి కూడా ఎన్నికల బరిలో కనిపిస్తారా..? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయ్. నిజానికి కోమటిరెడ్డి బీజేపీలో ఉంటరా.. ఉండరా అనే చర్చ జరిగింది ఈ మధ్య.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 06:46 PM IST

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నువ్వా నేనా అంటుంటే.. బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉండి పోయింది. పోనీ మౌనం వెనక ఏదైనా వ్యూహం ఉందా అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లిస్ట్ కూడా అనౌన్స్‌ చేయలేదు. త్వరలో అనే మాట కూడా వాడే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడు అనౌన్స్‌ చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అసలే సాగదీత ధోరణి అంటే.. లుకలుకలు పార్టీని మరింత టెన్షన్ పెడుతున్నాయ్. గ్రూప్‌లుగా విడిపోయి మరీ మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు నేతలు.

ఇదీ కాకుండా.. నేతల తీరు పార్టీని మరింత కన్ఫ్యూజ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి.. మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. ఈ సారి ఎన్నికల బరిలో దిగడం కన్ఫార్మ్. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. మునుగోడు నుంచి పోటీ చేస్తారా.. ఎల్బీనగర్‌ నుంచి నిలుస్తారా.. రాజగోపాల్‌ మాత్రమేనా ఆయన సతీమణి కూడా ఎన్నికల బరిలో కనిపిస్తారా..? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయ్. నిజానికి కోమటిరెడ్డి బీజేపీలో ఉంటరా.. ఉండరా అనే చర్చ జరిగింది ఈ మధ్య. ఐతే ఆయన ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. బీజేపీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మధ్యే జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి.. తాను రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. మునుగోడుతో పాటు ఎల్బీనగర్‌ జనాలు కూడా తనను పోటీ చేయాలని కోరుతున్నారని.. ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఐతే ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని బాంబ్‌ పేల్చడంతో.. రాజగోపాల్‌ వ్యాఖ్యలపై పార్టీలో, రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మునుగోడు నుంచే పోటీ అన్నారు.. ఇంతలోనే ఎల్బీనగర్ జనాలు కోరుకుంటున్నారు అన్నారు. ఇంతకీ రాజగోపాల్ మనసులో ఏముంది..? పోటీ మీద ఆయన కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? లేదంటే మనసు మార్చుకున్నారా..? అసలు రెండు నియోజకవర్గాల్లో కాలు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు..? పొలిటికల్ అటెన్షన్‌ కోసమే ఇలా మాట్లాడారా..? అంటూ రకరకాల చర్చ జరుగుతోంది. ఐతే రాజగోపాల్‌ రెడ్డి ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి.. ఆయన భార్య లక్ష్మిని మునుగోడు బరిలో దింపే ప్లాన్ చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా రాజగోపాల్ తీరు అటు పార్టీ శ్రేణులనే కాదు.. రాజకీయవర్గాలను కూడా కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాయ్.