Komatireddy Raj Gopal Reddy: తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రాజగోపాల్‌ రెడ్డి.. ఆ స్థానం నుంచి టికెట్‌ కోసం వెయిటింగ్‌..

నల్గొండ జిల్లాలో మంచి గ్రిప్‌ ఉన్న సీనియర్‌ రాజకీయ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 01:53 PM IST

Komatireddy Raj Gopal Reddy: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టికెట్లు ఆశించి రానివాళ్లు, తమ పార్టీలతో అసంతృప్తిగా ఉన్నవాళ్లు వరుసగా పార్టీలు మారుతున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో జంపింగ్‌లు నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం రోజుకో టర్న్‌ తీసుకుంటోంది. నల్గొండ జిల్లాలో మంచి గ్రిప్‌ ఉన్న సీనియర్‌ రాజకీయ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న రాజగోపాల్‌ రెడ్డి కొంత కాలం క్రితం ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటూ రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో అప్పటి నుంచి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నారు. రాజకీయంగా కూడా పెద్దగా యాక్టివ్‌గా లేరు. బీజేపీలో సరైన గుర్తింపు లేని కారణంగానే రాజగోపాల్‌ రెడ్డి పార్టీలో సైలెంట్‌గా ఉంటున్నారంటూ ఆయన అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు బీజేపీ రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో రాజగోపాల్‌ రెడ్డి పేరు లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఇక బీజేపీలో కంటిన్యూ అవలేక తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరేందుకు డిసైడ్‌ అయినట్టు చర్చించుకుంటున్నారు. ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేయాలి అంటూ ప్రజలు తనను కోరుతున్నారని రాజగోపాల్‌ రెడ్డి గతంలో ఓసారి చెప్పారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి కూడా ఎల్బీ నగర్‌ టికెట్‌ ఆశిస్తున్నారట రాజగోపాల్‌ రెడ్డి. ఇదే విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోందట. ఈ విషయంలో క్లారిటీ వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రాజగోపాల్‌ రెడ్డి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎప్పుడు అధికారికి ప్రకటన వస్తుందో చూడాలి. ఏది ఏమైనా తమ ప్రియతమ నాయకుడు మరోసారి కాంగ్రెస్‌కే వచ్చేస్తున్నారని తెలియడంతో రాజగోపాల్‌ రెడ్డి అనుచరులు ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నారు.