Komatireddy Vs Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌లో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ముందు నుంచి అంతా అనుకున్నట్టే ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో బీజేపీ ఫెయిల్ అయ్యిందని, మొదట్లో బీజేపీలో జోష్ కనిపిచినా తరువాత పార్టీ డీలా పడిపోయిందని కోమటిరెడ్డి విమర్శించారు. ఆ కారణంగానే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని క్లారిటీ ఇచ్చారు.
తన అభిమానులు, పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు చెప్పారు. అయితే కొంత కాలం క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తున్న సమయంలో కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యిందని, కొత్తగా వచ్చినవాళ్ల పెత్తనం ఎక్కువైందని రేవంత్ మీద ఇండైరెక్ట్ పంచులు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ చెప్పి బీజేపీలో చేరారు. పార్టీ మారిన వెంటనే రేవంత్ రెడ్డి రాజగోపాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన నీచుడు అంటూ బూతు పురాణం మొదలుపెట్టారు.
పండబెట్టి తొక్కుతానంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ మాటలకు రాజగోపాల్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. నీ హైట్ చూసుకున్నావా.. ఎవరి ఎవర్ని తొక్కుతారో తెలుస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. తానంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు వేలల్లో ఉన్నారని.. తనను ఒక్క మాట అన్నా వాళ్లు ఊరుకోరంటూ వార్నింగ్ ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు తిరిగి అదే పార్టీలోకి వెళ్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మరోసారి అదే రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీలో పని చేయబోతున్నారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు.
దీంతో అప్పట్లో వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకోసం ఈ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అధికారం కోసం ఎన్ని మాటలైనా చెప్తారు, ఎన్ని పార్టీలైనా మారుతారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.