Komatireddy Vs Revanth Reddy: వైరల్ అవుతోన్న రాజగోపాల్ పాత పోస్ట్‌.. కాంగ్రెస్‌లో రేవంత్‌తో అడ్జస్ట్ అవగలరా ?

కాంగ్రెస్‌కి తిరిగి వెళ్లిన రాజగోపాల్‌.. ఇప్పుడు ఆ పార్టీలో అడ్జస్ట్ అవగలరా లేదా అనేది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత.. ఆయన తీరు నచ్చకపోవడంతోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు రాజగోపాల్.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 04:13 PM IST

Komatireddy Vs Revanth Reddy: అనుకున్నదే జరిగింది.. కాకపోతే కాస్త ఆలస్యం అయింది అంతే ! కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. రెండు రోజుల్లో రాహుల్ సమక్షంలో హస్తం పార్టీ తీర్థం ఫ్రెష్‌గా పుచ్చుకోబోతున్నారు. బీజేపీకి బైబై చెప్పి.. హస్తం పార్టీలో చేరేందుకు రాజగోపాల్ సిద్ధం అవుతుండడంతో.. ఈ పరిణామం ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే చర్చ జరుగుతోంది. ఇదంతా వేరే సంగతి అయినా.. కాంగ్రెస్‌కి తిరిగి వెళ్లిన రాజగోపాల్‌.. ఇప్పుడు ఆ పార్టీలో అడ్జస్ట్ అవగలరా లేదా అనేది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది.

రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత.. ఆయన తీరు నచ్చకపోవడంతోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు రాజగోపాల్. అలాంటిది ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో చేరబోతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. మళ్లీ రేవంత్‌తోనే పనిచేయాలి. కాదు కాదు రేవంత్‌ ఆదేశాల ప్రకారం పనిచేయాలి. మరి రాజగోపాల్ అది చేస్తారా లేదా అన్నది ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఎంత ఢిల్లీ పెద్దల అండ ఉన్నా.. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి. పైగా రేవంత్‌కు రాహుల్‌ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అలాంటిది ఎన్నికల వేళ రేవంత్‌తో కలిసి రాజగోపాల్‌ ఎలా పనిచేయగలరు. అసలు పనిచేయగలరా లేదా అన్నది కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా… రాజగోపాల్ గతంలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత.. రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ ట్విట్టర్‌లో ఓ ఘాటు పోస్ట్ చేశారు రాజగోపాల్. రేవంత్ పెద్ద బ్లాక్‌మెయిలర్ అని.. ఆయనతో కలిసి పనిచేయడం కంటే.. రాజకీయాలు వదిలేసుకోవడం బెటర్ అంటూ రాసుకొచ్చారు. కాంగ్రెస్‌ నుంచి అందరూ వచ్చేయండి.. బీజేపీలో చేరండి.. కలిసి పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరబోతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. రేవంత్‌తో కచ్చితంగా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి.

మరి రాజగోపాల్‌.. రేవంత్‌తో కాంగ్రెస్‌లో అడ్జస్ట్ అవగలరా.. అసలు అలాంటి పరిస్థితులు హస్తం పార్టీలో ఉన్నాయా.. వద్దనుకొని వెళ్లి.. మళ్లీ తిరిగి వస్తే వాళ్లను ఎలా చూస్తారో.. ఎలా డీల్ చేస్తారో అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య రాజగోపాల్‌.. కాంగ్రెస్‌లో సర్దుకోగలరా లేదా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.