ఓరుగల్లుతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయినా కొండా సురేఖ.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రేవంత్ కేబినెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. అందులో కొండా సురేఖ ఒకరు. మొదట టీడీపీలో చేరిన ఆమె.. తర్వాత కాంగ్రెస్‌కు, వైఎస్సార్సీపీ కి వెళ్ళారు. మళ్ళీ టీఆర్ ఎస్‌లో చేరి.. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ- పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ.. గతంలో శాయంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచారు. ఇప్పుడు కొండా సురేఖ నాలుగోసారి విజయం సాధించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి : ప్రమాణ స్వీకారం LIVE UPDATES
కొండా సురేఖ.. ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు ఎన్నో పదవుల్లో కొనసాగారు. 1995లో మండల పరిషత్ కు ఎన్నికైన సురేఖ.. 1996లో ఏపీ PCC మెంబర్ గా నియమితులయ్యారు. 1999 లో శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఆమె కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా, మహిళ, శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగా, ఆరోగ్య, ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. 2000లో AICC మెంబర్ గా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. 2004లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాక.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. 2005లో కొండా సురేఖ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఉన్నారు. 2009లో పరకాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. 2009లోనే ఉమ్మడి ఏపీలో వైఎస్‌ఆర్ కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు.
వైఎస్సార్ చనిపోయిన తర్వాత… కాంగ్రెస్ అధిష్టానం జగన్ కి.. ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ కు రిజైన్ చేశారు కొండా సురేఖ. 2011లో ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. తర్వాత వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేశారు. మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్ఎస్ లో చేరిన కొండా సురేఖ.. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కొండా సురేఖకు.. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. బీసీగా, మాజీ మంత్రిగా, మహిళగా.. సీనియర్ లీడర్ గా కొండా సురేఖకు ఈ అవకాశం దక్కింది.