తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మజ్లిస్ పార్టీ తన రూట్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళుగా BRS తో దోస్తీ కట్టిన MIM.. ఇప్పుడు ఆ పార్టీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్టు అర్థమవుతోంది. ప్రొటెం స్పీకర్ గా MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ని ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం చూస్తే.. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో మజ్లిస్ ఎమ్మెల్యేలు సెక్రటేరియట్ లో సమావేశం అయ్యారు. అక్బరుద్దీన్ సహా ఏడుగురు ఎమ్మెల్యేలు పాతబస్తి అభివృద్ధిపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై సీఎంతో డిస్కస్ చేసినట్టు చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో మీటింగ్ కి వచ్చే ముందు MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించి వచ్చారు.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ను ప్రభుత్వం ఎంపిక చేయడంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా.. ఆయన్నే ఎందుకు ఎంపిక చేశారని మండిపడ్డారు. ఇతర సీనియర్లు ఉన్నా.. ఒకే పార్టీ నుంచి వరుసగా గెలిచింది అక్బరుద్దీన్ మాత్రమే.. అందుకే ఆయన్ని సెలక్ట్ చేశామని కాంగ్రెస్ సమర్థించుకుంది. కానీ కాంగ్రెస్ కి బొటా బోటీ మెజారిటీ ఉండటంతో మజ్లిస్ తో పొత్తు కోసం ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ విమర్శలు ఎలా ఉన్నా.. మజ్లిస్ మాత్రం కాంగ్రెస్ కు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.
జనరల్ గా ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంతో సన్నిహితంగా ఉండటం మజ్లిస్ కి అలవాటు. ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాం వరకూ కాంగ్రెస్ తో MIM దోస్తీ కట్టింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెండు పార్టీల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఇదే విధానం జాతీయ రాజకీయాల్లోనూ చూపిస్తోంది మజ్లిస్. కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రయత్నిస్తోంది. యూపీ, గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టి… ముస్లిం ఓట్లను చీలుస్తోంది. దాంతో పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి కారణమవుతోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మజ్లిస్ అభ్యర్థులను నిలబెట్టింది. బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో BRS ఎక్కువ స్థానాలు రావడానికి కూడా మజ్లిస్ మద్దతే కారణమని అంటున్నారు.
ఉన్నట్టుండి కాంగ్రెస్ కు MIM ఎందుకు దగ్గరవుతోంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే తమ పనులు చేసుకోవచ్చనేది ఒక కారణం. ఇంకో విషయం గమనిస్తే.. MIM పోటీ చేసి గెలిచిన ఏడు స్థానాల్లో దాదాపు MLAలు అందరికీ గతం కంటే మెజారిటీ తగ్గింది. దీంతో పాతబస్తీ లో తమ పలుకుబడి డౌన్ అవుతోందని ఓవైసీ బ్రదర్స్ భయపడుతున్నారు. అందుకే ఎన్నికల తర్వాత.. ఈ ఎమ్మెల్యేలంతా ఓల్డ్ సిటీలో తిరుగుతూ జనం సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ను కాదనుకుంటే.. MBT కి దగ్గరయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఓల్డ్ సిటీలో తాము ఇంకా తీవ్రంగా నష్టపోతామని మజ్లిస్ నేతలు టెన్షన్ పడ్డారు. అందుకే పాత విషయాలన్నీ మర్చిపోయి.. కాంగ్రెస్ కు దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ కు డైరెక్ట్ గా మద్దతు ఇవ్వకపోయినా తాము ప్రభుత్వం వైపే ఉన్నామన్న సంకేతాలు పంపుతోంది MIM. హస్తం పార్టీ కూడా ఈ ఫ్రెండ్షిప్ జాతీయ రాజకీయాల్లో కూడా పనికొస్తొందని ఆశిస్తోంది