BRS Vs TRS: ఎన్నికల బరిలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌కు ఇబ్బంది తప్పదా..?

సిద్ధిపేట జిల్లాకు చెందిన బాలరంగం టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్య సమతి) అనే పేరుతో పార్టీని స్థాపించారు. దీనికి ఈసీ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ పార్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయడం లాంఛనమే. ఈసీ పార్టీకి ఆమోదం తెలపడంతో గుర్తు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు పార్టీ నేతలు.

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 06:41 PM IST

BRS Vs TRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ బరిలోకి దిగనుంది. అదేంటీ.. టీఆర్ఎస్ ఎప్పుడో బీఆర్ఎస్‌గా మారింది కదా అనుకుంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రాజ్య సమితి. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడంతో అదే పేరుతో కొత్త పార్టీ ఏర్పాటైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన బాలరంగం టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్య సమతి) అనే పేరుతో పార్టీని స్థాపించారు. దీనికి ఈసీ కూడా ఆమోదం తెలిపింది.

ఇక ఈ పార్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయడం లాంఛనమే. ఈసీ పార్టీకి ఆమోదం తెలపడంతో గుర్తు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు పార్టీ నేతలు. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గురువారం కొత్త పార్టీలకు ఈసీ గుర్తులు కేటాయించింది. దీని ప్రకారం టీఆర్ఎస్‌కు వంట గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎవరైనా పోటీ చేయాలనుకుంటే వంట గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేయొచ్చు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు గుర్తింపు రావడం బీఆర్ఎస్‌కు ఇబ్బందికరమే అని ఆ పర్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ పేరుతో ఆ పార్టీ ప్రచారం చేసుకుంటే ప్రజలు గందరగోళానికి, అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు ప్రజలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ మధ్య తేడాను గుర్తించలేకపోవచ్చు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ పార్టీ స్థాపించిన బాలరంగం గతంలో కేసీఆర్‌తో కలిసి టీఆర్ఎస్‌లోనే పని చేశారు. కొంతకాలం తర్వాత కేసీఆర్‌ను వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చారు.

ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం బాలరంగం టీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. అయితే, ప్రజలు పార్టీ పేరు విషయంలో అయోమయానికి గురవుతారు అనే అనుమానం ఉన్నప్పుడు వివిధ పార్టీలు ఈసీని, కోర్టును ఆశ్రయిస్తాయి. దీంతో బీఆర్ఎస్ ఏం చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది.