Komatireddy Rajgopal Reddy: మునుగోడులో మంటలు.. రాజగోపాల్‌కు వ్యతిరేకంగా హస్తం నేతల నిరసన

మునుగోడు నుంచి రాజగోపాల్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి పారాచుట్‌ నేతలకు టికెట్‌ ఇస్తే పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి అని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ప్రశ్నిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 07:34 PM IST

Komatireddy Rajgopal Reddy: బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఇలా ప్రకటించారో లేదో.. అలా మునుగోడులో నిరసన మొదలైంది. మునుగోడులో కాంగ్రెస్‌ నేతలు పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి నేతృత్వంలో నిరసనకు దిగారు. మునుగోడు నుంచి రాజగోపాల్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి పారాచుట్‌ నేతలకు టికెట్‌ ఇస్తే పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి అని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 2022లో ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ మారుతున్న సమయంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పడు రాజగోపాల్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నానంటూ ప్రకటించారు. అంతే కాదు.. మునుగోడుతో పాటు సిద్ధిపేట్‌లో కూడా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తానంటూ చెప్పారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలంటూ సవాల్‌ విసిరారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఇప్పుడు సొంత నియోజకవర్గ నేతల నుంచే రాజగోపాల్‌ రెడ్డికి నిరసన సెగ తగులుతోంది.

కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తాం కానీ మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే రాజగోపాల్‌ కోసం పని చేయబోమంటూ చెప్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి ఇప్పుడు అదే కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్‌కు తప్ప ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ గెలుపుకోసం పని చేస్తామంటూ చెప్పారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజగోపాల్‌కు టికెట్‌ ఇస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం తాను మునుగోడుతో పాటు సిద్ధిపేట్‌ నుంచి కూడా పోటీ చేస్తానంటూ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తన డిమాండ్‌ వినిపించారు రాజగోపాల్‌ రెడ్డి.

దీనిపై స్క్రీనింగ్‌ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపే మునుగోడులో వ్యతిరేక గళం వినిపించడం ఇప్పుడు రాజగోపాల్‌ అభ్యర్థిత్వాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుది అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.