PALAIR: తెలంగాణలో చర్చకు కేరాఫ్ అయిన నియోజవర్గాల్లో పాలేరు మొదటి వరుసలో ఉంటుంది. పొంగులేటి ఇదే స్థానం కోరడం.. తుమ్మల ఈ సీటుపైనే ఆశపడడం.. షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగాలి అనుకోవడంతో ఈ నియోజవకర్గంపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులు కూడా పాలేరు స్థానాన్నే కోరారు. దీంతో పాలేరు గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇక్కడ విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్‌తో పాటు.. కాంగ్రెస్, బీజేపీ కూడా స్పెషల్‌గా ఫోకస్ పెడుతున్నాయ్.
2018 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కారు పార్టీలోకి వెళ్లారు. ఈసారి ఆయనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. ఐతే ఈ సీటుపై పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో జరిగిన చర్చలు అన్నీ ఇన్నీ కావు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. పాలేరు నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. ఐతే వైటీపీ అధినేత్రి షర్మిల కూడా పాలేరు సీటు కోసమే కాంగ్రెస్‌తో కలిసే ప్రయత్నం చేశారు. చివరికి పాలేరు సీటు కేటాయించడంపై హస్తం పార్టీ ససేమిరా అనడంతో.. షర్మిల తన పార్టీ నుంచే పాలేరు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైటీపీ నుంచి వైఎస్ షర్మిల.. ఇలా హేమాహేమీలంతా పాలేరు బరిలో నిలవడంతో ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఎవరికి వారు గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఐతే ఇక్కడ కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కూడా గట్టిగానే ఉంది. దీంతో నియోజకవర్గ జనాలు గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదా అధికార బీఆర్ఎస్‌కు పట్టం కడతారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏమైనా ఈసారి అందరి ఆసక్తి ఉండే నియోజకవర్గాల లిస్ట్‌లో.. పాలేరు టాప్‌లో ఉండబోతుంది అన్నది క్లియర్.