PM MODI: తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వంటి అగ్రనేతలు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఎన్నికలకు నెల రోజులకంటే తక్కువ గడువే ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీతో కూడా బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నెలలో మోదీ తెలంగాణలో పలుమార్లు పర్యటించబోతున్నారు.
వచ్చే వారంలోనే రెండు రోజులు.. సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటిస్తారు. ఈ తేదీల్లో హైదరాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటికి మోదీ హాజరవుతారు. ఈ నెల రెండో వారం తర్వాత ప్రధాని మరోసారి నవంబర్ 19న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున జాతీయ పార్టీ కాబట్టి.. బీజేపీ అన్ని రాష్ట్రాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే తెలంగాణకు మోదీ తక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది. అయితే, పూర్తి పర్యటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. అలాగే బీసీలకు అధిక సీట్లు కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది. బీసీ సీఎం అంశం తమకు కలిసొస్తుందని బీజేపీ ఆలోచన.
గురువారం బీజేపీ మూడో జాబితా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంకొన్ని స్థానాలకు మాత్రం సీట్లను కేటాయించాల్సి ఉంది. వీటిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికే ప్రచారంలో వెనుకబడ్డ బీజేపీ ఇకనైనా దూకుడు పెంచుతుందేమో చూడాలి.