Telangana Assembly Elections: సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్.. ఈసీ నిర్ణయం..

ఎన్నికల్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అనుకుంటోంది. దీనిలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించింది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది.

  • Written By:
  • Publish Date - October 30, 2023 / 02:28 PM IST

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయమే ఉంది. వచ్చే నెల 30న ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికల్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అనుకుంటోంది. దీనిలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించింది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది.

ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచల నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక నేతలు, పోటీదారులు, ప్రజా ప్రతినిధులకు దీనిపై అవగాహన కల్పిస్తారు. మిగిలిన 106 నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఈసీ. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిపింది. ఈ మేరకు సీఈవో వికాస్ రాజ్.. ఈ వివరాల్ని ఈసీఐకి తెలిపారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈసీ అధికారులు, పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, నగలు వంటివి స్వాధీనం చేసుకుంటున్నారు.