TELANGANA ASSEMBLY ELECTIONS: ఇది ప్రజల తెలంగాణకు.. దొరల తెలంగాణకు మధ్య యుద్ధం: రాహుల్ గాంధీ

ఇప్పుడు జరుగుతోంది ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య యుద్ధం. కేసీఆర్ సీఎంలా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకే న్యాయం జరుగుతోంది. ప్రజలకు, రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది.

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 04:47 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అధికారం వచ్చిన వెంటనే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారంలో గురువారం జరిగిన బస్సు యాత్రలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పలు హామీలిచ్చారు. “ఇప్పుడు జరుగుతోంది ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య యుద్ధం. కేసీఆర్ సీఎంలా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులకే న్యాయం జరుగుతోంది. ప్రజలకు, రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నారు. అయినా, కేసీఆర్‌పై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రం ఎందుకు కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఎంఐఎం, బీజేపీ.. లోపాయికారీ ఒప్పందంతో ముందుకుసాగుతున్నాయి. ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని నిలబెడుతూ.. పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోంది. నేను అబద్దాలు చెప్పేందుకు తెలంగాణకు రాలేదు. తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ అనుబంధం కాదు. కుటుంబ బంధం. నేను నిన్న నా సోదరి ప్రియాంకను తీసుకొచ్చా. మా నాయనమ్మ ఇందిరాతో తెలంగాణకు అనుబంధం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 2500 వేస్తాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.

రాహుల్ గాంధీ అబద్దం ఆడరు, నిజం తెలుసు కోవాలంటే కర్ణాటక వాళ్లను అడగండి. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. తెలంగాణలో సంపద ఏమవుతుందో తెలుసుకోండి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు చెప్పడం లేదు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతాం. నరేంద్ర మోదీ ప్రతి కుటుంబానికి 15లక్షలు వేస్తా అన్నారు. జీఎస్టీతో పేద వారికి న్యాయం చేస్తానని మోసం చేశారు” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.