Rani Rudrama: సిరిసిల్ల నుంచి రాణి రుద్రమకు టికెట్ కేటాయించింది బీజేపీ. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు కూడా. కేటీఆర్‌కు గట్టి పోటీ ఇవ్వడం కాదు.. ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు రుద్రమ. ఐతే రుద్రమ ప్రచారం మొదలుపెట్టడానికి ముందు.. ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామిని కలిసి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వేణుస్వామి కాళ్లకు నమస్కరించిన ఫొటోను రుద్రమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐతే ఇదే కొత్త రచ్చకు కారణం అయింది.
రాణి రుద్రమ పోస్ట్ చేసిన ఫొటోను.. శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒకరు షేర్ చేశారు. ఆ ఫొటోకు అసభ్యంగా రాసుకొచ్చారు. దీంతో ఆ ఫొటో మీద రెండు రోజులుగా తెగ ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై రుద్రమ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సిరిసిల్లలో రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేక.. మంత్రి కేటీఆర్ ఇంత నీచస్థాయికి దిగజారిపోతున్నవా అని ప్రశ్నిస్తూ ఆ ఫొటోను షేర్ చేసి రుద్రమ మరో ట్వీట్ చేశారు. తాను తండ్రిలా భావించే వ్యక్తి దగ్గర దసరా పండగపూట ఆశీర్వాదం తీసుకుంటే.. మీ చిల్లర చెంచాగాళ్లతో సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టించిన కుసంస్కారానికి సిరిసిల్ల జనాలు బుద్ధిచెబుతారని ఫైర్ అయ్యారు. మహిళలపై అరాచకాలు చేసి, అవమానించే మీ దొర దురహంకార అధికారమదానికి సిరిసిల్ల మహిళలు ఓట్ల రూపంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.
మహిళలపై ఆకృత్యాలు చేసిన రజాకార్లను, దొరలను తరిమి కొట్టిన తెలంగాణ గడ్డ ఇదని, చరిత్ర పునరావృత్తం అయితే మీరు దేశాలు దాటి పారిపోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు రుద్రమ. సోషల్ మీడియా.. బీఆర్ఎస్‌కు మాత్రమే లేదని.. బీజేపీ తలుచుకుంటే మీరంతా గాల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు రుద్రమ. ఐతే ఎవరో ఒకరు షేర్ చేసినదానికి దాన్ని సిరిసిల్లకు ఆపాదించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణుల్లో కొందరు అంటున్నారు. ఏమైనా ఒక్క ఫొటో మిగిల్చిన రచ్చ అంతా ఇంతా కాదు.