REVANTH REDDY: రేవంత్‌కు కొడంగల్‌లో షాక్ తప్పదా.. తిరగబడుతున్న అనుచరులు..!

తాజాగా కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టిక్కెట్ దొరకని వాళ్లు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. వారిలో ఉప్పల్ నియోజకవర్గం నేత సోమశేఖర్ రెడ్డి ఒకరు. రేవంత్ అనుచరుడిగా పేరున్న సోమశేఖర్ రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 08:31 PM IST

REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్‌కు జోష్ తెచ్చిన నేతగా పేరుపొందిన రేవంత్ రెడ్డి ఒకవైపు పార్టీని గెలిపించుకునే పనిలో ఉంటే.. మరోవైపు అనుచరుల నుంచి తిరుగుబాట్లు ఎదుర్కొంటున్నాడు. కొడంగల్‌లోనే రేవంత్‌కు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు కొందరు తిరుగుబాటు నేతలు సిద్ధమవుతున్నారు. రేవంత్ ముఖ్య అనుచరుల్లో ఒకడైన సోమశేఖర్ రెడ్డితోపాటు మరికొందరు నేతలు రేవంత్‌ను ఓడిస్తామంటూ శపథం చేస్తున్నారు. రేవంత్ బాధితులను కలుపుకొని కొడంగల్‌లో ఆయన ఓటమికి కృషి చేస్తామన్నారు.

తాజాగా కాంగ్రెస్ తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టిక్కెట్ దొరకని వాళ్లు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. వారిలో ఉప్పల్ నియోజకవర్గం నేత సోమశేఖర్ రెడ్డి ఒకరు. రేవంత్ అనుచరుడిగా పేరున్న సోమశేఖర్ రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నమ్ముకొని తాను మోసపోయానని సోమశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నారు. నా లాంటి రేవంత్ బాధితులను కలుపుకొని కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తాం. ఉప్పల్‌లో నేనే గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పినా రేవంత్ రెడ్డి టికెట్ మరొకరికి అమ్ముకున్నారు. నేను గత తొమిదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. జీహెచ్ఎంపీ ఎన్నికల్లో నా భార్య శిరీష రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా గెలిచింది” అని సోమ శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌కు సన్నిహితుడిగా ఎన్నో ఏళ్లు ఉన్నానని, 2014, 2018లో టికెట్ ఆశ చూపించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నారని సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అనే నినాదంతో ప్రచారం చేస్తానన్నారు. 300 మందికిపైగా ఉన్న రేవంత్ బాధితులంతా కలిసి ఆయనను కొడంగల్‌లో ఓడిస్తామని చెప్పారు. ప్రస్తుతం అభ్యర్థుల జాబితా ప్రకటించినందున టిక్కెట్లు దక్కని చాలా మంది ఇలా రేవంత్‌పై ఆరోపణలు చేసే వీలుంది. వీళ్లందరినీ ఎదుర్కొని రేవంత్ గెలవాల్సి ఉంటుంది.