TELANGANA ASSEMBLY ELECTIONS: సీఎం అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న.. ఏ పార్టీ నుంచంటే..?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అక్షర యుద్ధం చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్నను తమ పార్టీ నుంచి పోటీ చేసేలా చర్చలు జరపుతున్నట్టు సమాచారం. ఒక వేళ ఈ ఆఫర్‌కు తీన్మార్‌ మల్లన్న ఓకే అంటే ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా ఏఐఎఫ్‌బీ పార్టీ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 06:43 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: ఈసారి తెలంగాణలో ఎన్నికలు మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ కాగా అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి బీఫాంలు పంచేందుకు రెడీ అవ్వగా.. కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఓ కీలక వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అక్షర యుద్ధం చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్నను తమ పార్టీ నుంచి పోటీ చేసేలా చర్చలు జరపుతున్నట్టు సమాచారం. ఒక వేళ ఈ ఆఫర్‌కు తీన్మార్‌ మల్లన్న ఓకే అంటే ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా ఏఐఎఫ్‌బీ పార్టీ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి మల్లన్నతో ఆ పార్టీ ఇదే చర్చలు జరుపుతోందట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా మేడ్చల్‌ నుంచి పోటీ చేస్తానని తీన్మార్‌ మల్లన్న చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి వచ్చిన ఆఫర్‌కు ఓకే అంటే అదే పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న మేడ్చల్‌ బరిలో దిగే చాన్స్‌ ఉంది. గతంలో కూడా మల్లన్న రెండుసార్లు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓసారి కాంగ్రెస్‌ నుంచి మరోసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఓసారి పోటీ చేశారు. మొదట్లో బీఆర్‌ఎస్‌కు సానుకూలంగానే ఉన్న మల్లన్న.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత ఆ పార్టీతో విభేదించారు. అప్పటి నుంచి తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అంతులేని ప్రజాదరణ కూడగట్టుకున్నారు మల్లన్న. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ప్రతీ ఒక్కరికి తీన్మార్‌ మల్లన్న ఓ పవర్‌లా కనిపించడం మొదలు పెట్టారు.

ఈ క్వాలిటీ కారణంగా గతంలో కాంగ్రెస్‌ టికెట్‌ కూడా ఇచ్చింది. కానీ మల్లన్న అప్పుడు ఓడిపోయారు. తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత కొంత కాలానికి బీజేపీలో అధికారికంగా జాయిన్‌ అయ్యారు. కానీ ఎక్కువ రోజులు ఆ పార్టీలో ఉండలేదు. అప్పటి నుంచి తీన్మార్‌ మల్లన్న టీం పేరుతో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి పోటీ చేస్తాను అని కూడా క్లియర్‌గా చెప్పేశారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ పోటీ చేయాలనే ఆఫర్‌ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తీన్మార్‌ మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.