Telangana Assembly Elections: ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడ్డ బీజేపీ తాజాగా తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమైంది. దాదాపు 65 మంది పేర్లతో తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను రెడీ చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు అంతా ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఒక్కసారి అధిష్టానం ఆమోదం లభిస్తే జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్నఅంచనా ప్రకారం.. టీ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది.
అయన కరీంనగర్ నుంచి మాత్రమే కాకుండా ముధోల్ నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం మాత్రం సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేయాల్సిందిగా కోరుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరో సీనియర్ లీడర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈసారి కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆయన అవసరమైతే కామారెడ్డిలో కేసీఆర్‌పై కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి పోటీ చేస్తారు. అయితే, ఈటల కూడా గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన సతీమణి ఈటల జమున.. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈటల కుటుంబం మేడ్చల్ పరిధిలోనే ఉంటుంది. అందువల్ల ఈ నియోజకవర్గంపై ఈటల సతీమణి ఆసక్తి చూపిస్తున్నారు.
తాండూరు నుంచి సీనియర్ లీడర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. బీజేపీ సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దుబ్బాక నుంచి బరిలోకి దిగుతారు. మాజీ ఎంపీ వివేక్ మాత్రం అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయన పార్లమెంట్ స్థానానికి మాత్రమే పోటీ చేయాలని చూస్తున్నారు. జగిత్యాల నుంచి బోగ శ్రావణి, ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరి పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.