TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్‌ ఖాయమా.. అదే నిజమైతే అధికారం ఎవరిది..?

క్షేత్రస్తాయిలో పరిస్థితులు, జనాల టాక్‌ చూస్తుంటే మాత్రం.. గెలుపు ఎవరిది అని క్లియర్‌గా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ప్రీ పోల్‌ సర్వేలు కూడా ఎటూ తేల్చడం లేదు. కొన్ని బీఆర్ఎస్‌దే అధికారం అంటుంటే.. మరికొన్ని కాంగ్రెస్‌దే గెలుపు అంటున్నాయ్.

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 07:41 PM IST

TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పొలిటికల్ సీన్ కనిపించలేదు. మాటలు మంటలు అవుతున్నాయ్. వ్యూహాలు పదునెక్కుతున్నాయ్. చిన్నపాటి యుద్ధం కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణలో. గెలుపు మీద పార్టీలన్నీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా.. క్షేత్రస్తాయిలో పరిస్థితులు, జనాల టాక్‌ చూస్తుంటే మాత్రం.. గెలుపు ఎవరిది అని క్లియర్‌గా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ప్రీ పోల్‌ సర్వేలు కూడా ఎటూ తేల్చడం లేదు. కొన్ని బీఆర్ఎస్‌దే అధికారం అంటుంటే.. మరికొన్ని కాంగ్రెస్‌దే గెలుపు అంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ నేతలు మాత్రం.. తెలంగాణలో హంగ్ అంటున్నారు.

వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా.. కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత ఈజీ కాదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నా.. అది అధికారం అందుకునేంతగా అంటే.. చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయ్. తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది లేదా అన్నది పక్కన పెడితే.. ఈసారి మాత్రం ఫైట్ వన్ సైడ్ మాత్రం కాదన్నది క్లియర్‌. నిజానికి ఈ విషయం బీఆర్ఎస్‌ నేతలకు కూడా తెలుసు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక పోయినా.. కాంగ్రెస్ మాత్రం విజయం అంచు వరకూ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నిజం అవుతాయని ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. జనాలు కొంత మార్పును కోరుకోవడం వల్లే.. కాంగ్రెస్ బలోపేతం అయిందని చెప్తున్నారు. కొన్ని వర్గాల జనాలు.. అధికార పార్టీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈసారి ఏకపక్ష గెలుపు బీఆర్ఎస్‌కు సాధ్యం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయ్. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయ్. హంగ్ వస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. బీఆర్ఎస్‌తో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ ఆ పార్టీ పక్షాన నిలుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయ్. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే బీజేపీ లక్ష్యం కాబట్టి.. ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక కాంగ్రెస్‌కు ఎవరు మద్దతిస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో మంచి ఫైట్ జరుగుతుంది. ఈసారి గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు.. ఒకవేళ గెలిచినా వారు ఏ గూటికి చేరతారు అంటే.. అప్పటికప్పడు వారికి దక్కే పదవులు, అందే ప్యాకేజీపైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.