TELANGANA BJP: ఎన్నికల వేళ తెలంగాణలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయ్. కీలక నేతలు పార్టీ మార్పు వ్యవహారం.. రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన బీజేపీ.. కేవలం ఒకే అభ్యర్దితో రెండో జాబితా విడుదల చేసింది. బీజేపీ తొలి జాబితా తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 52 మందితో ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌పై తీవ్ర అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయ్. దీంతో పార్టీ అధినాయకత్వం రెండో జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో నెక్ట్స్ లిస్ట్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
ఇక అటు అనూహ్యంగా కేవలం ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్దిని బీజేపీ ప్రకటించింది. మహబూబ్‌నగర్ అభ్యర్దిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పేరును పార్టీ ప్రకటించింది. తొలుత ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ ఆలోచన చేసింది. ఐతే జితేందర్ రెడ్డి తాను ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పటంతో.. ఇప్పుడు ఆయన కుమారుడి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఈసారి ఎన్నికల్లో బీసీ కార్డునే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ.. తొలి జాబితాలో ఆ సామాజికవర్గం నుంచి ఏకంగా 17మందికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితాలోనూ అలాంటి ప్రాధాన్యమే ఇస్తారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి బీసీ నాయకులను వెతికి అవకాశం ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చిన దరఖాస్తులపై, ఇతర పార్టీల్లో పరిణామాలతో కొత్తగా వస్తున్న అభ్యర్థనలపై మరోసారి కసరత్తు చేసి, మిగతా 67మంది అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరుకు ఖరారు చేస్తారని అంచనా వేస్తున్నారు. తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇచ్చారు. ఇక అటు బీజేపీ, జనసేన పొత్తులపై రెండు పార్టీల అగ్రనేతల మధ్య చర్చలు జరగనున్నాయ్. జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తారనే విషయమై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.